కడచూపు కోసం.. కన్నీటి పయనం
షాద్‌నగర్: విదేశీ ప్రయాణం అంటే సంతోషంగా ముందుకు సాగుతారు.. అక్కడే స్థిరపడి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన పిల్లలు, బంధువులను చూసేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతారు. కానీ రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి, పవిత్ర దంపతుల అమెరికా ప్రయాణం కన్నీటి మయమైంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్‌రెడ్డి, వియ్యంకురాలు సునీతారెడ్డిని చివరిసారిగా చూసేందుకు మంగళవారం వారు స్వగ్రామం నుంచి బయల్దేరారు. ఈ నేపథ్యంలో టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు, మనుమడిని తలచుకుంటూ బాధితులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను ఇండియా తెప్పించేందుకు వీలు కావడం లేదని, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రగతి అత్తింటి వారి నుంచి సమాచారం రావడంతో బరువెక్కిన హృదయాలతో బయల్దేరారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి దుండగుల కాల్పుల్లో మృతిచెందిన కేశంపేట విద్యార్థి గంప ప్రవీణ్ ఘటనను మరవకముందే.. ఈదుర్ఘటన జరగడం నియోజకవర్గ వాసులను కలవరపెడుతోంది. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పడం కనిపించింది.
పలువురి పరామర్శ
అమెరికాకు పయనమైన మోహన్‌రెడ్డి దంపతులు టేకులపల్లి నుంచి నగరంలోని కొత్తపేటలో ఉన్న తమ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి వీరిని కలిసి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment