స్వాహాపర్వం | - | Sakshi
Sakshi News home page

స్వాహాపర్వం

Published Sat, Mar 22 2025 9:13 AM | Last Updated on Sat, Mar 22 2025 9:12 AM

సహకారం
రైతు సేవలకు స్వస్తి

వికారాబాద్‌లోని డీసీఎంఎస్‌ కార్యాలయం

వికారాబాద్‌: డీసీఎంఎస్‌ ఆస్తుల లీజు వ్యవహారంలో సంబంధిత అధికారులు, సిబ్బంది లోపాయికారీ దందాకు తెరతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు సేవలే లక్ష్యంగా ఏర్పాటైన సహకార మార్కెట్‌ సంఘాలు మెల్లగా అన్నదాతలకు దూరమవుతున్నాయి. జిల్లాలో సహకార మార్కెటింగ్‌ సంఘాల పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారుల వ్యవహార శైలిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్‌లకు జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉండగా వాటి లీజు కేటాయింపుల్లో లోపాయికారీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులతో అధికారులు, ఉద్యోగులు కుమ్మకై ్క తక్కువ లీజుకు భవనాలు, దుకాణాలు, గోదాములు కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వందకు పైగా దుకాణాలు, పదికి పైగా గోదాములు, రైస్‌ మిల్లులు, ఇతర భవనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం లీజుకు ఇచ్చారు. మార్కెట్‌ విలువ కంటే తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మార్కెట్‌ విలువలో సగం కంటే తక్కువ లీజుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి.

ఇష్టారాజ్యంగా దుకాణాల కేటాయింపు

డీసీఎంఎస్‌కు వికారాబాద్‌లో 39 దుకాణాలు, రెండు గోదాములు ఉన్నాయి. తాండూరులో మూడు గోదాములు, 40 దుకాణాలు, ఒక స్కూల్‌ బిల్డింగ్‌, ఒక రైస్‌మిల్లు, ఒక దాల్‌మిల్లు ఉంది. పరిగిలో 25 దుకాణాలు, ఐదు గోదాములు, ఒక రైస్‌మిల్‌ ఉంది. వీటిలోనే ఎరువులు, విత్తనాలు అమ్మేవారు. ప్రస్తుతం దుకాణాలు, గోదాములు, రైస్‌ మిల్లులను లీజ్‌కు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఉద్యోగులకు పనులు లేక కార్యాలయాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. దుకాణాల కేటాయింపులో లోపాయికారీగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాల్లో మెయిన్‌ రోడ్లలో దుకాణా సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దుకాణం నెల అద్దె రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుంది. పరిగి పట్టణంలో మున్సిపాలిటీకి ఉన్న దుకాణాలకు వేలం వేయగా నెలకు ఒక్కో దుకాణాన్ని రూ.15 వేల నుంచి రూ.36 వేల వరకు పాడి దక్కించుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు సైతం తమ దుకాణాలకు ఇదే తరహాలో రెంట్లు వసూలు చేస్తున్నారు. కానీ డీసీఎంఎస్‌ అధికారులు మాత్రం లోపాయికారీగా వ్యవహరిస్తూ తక్కువ ధరలకే దుకాణాలు కట్టబెడుతున్నారు. సంస్థకు నష్టం చేస్తూ వారు మాత్రం లాభ పడుతున్నారు. ఒక చోట ఒక దుకాణానికి రూ.4,720, మరో చోట రూ.5,450, ఇంకో చోట రూ.6,680, మరో చోట రూ.9,500 రెంట్లు వసూలు చేస్తున్నారు. రెండేళ్లకోసారి పాత లీజుకే పాతవారికి షాపులను కట్టబెడుతున్నారు.

తక్కువ అద్దెలకే డీసీఎంఎస్‌ ఆస్తులు కట్టబెడుతున్న అధికారులు

బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే సగమే!

రైతు సేవలకు దూరమవుతున్న సహకార సంఘాలు

ఎరువులు, విత్తనాల విక్రయానికి స్వస్తి పలికిన యంత్రాంగం

గతంలో మండల కేంద్రాల్లోని డీసీఎంఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించేవారు. ఇవి ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో సర్కారు నిర్ధేశించిన ధరలకే ఇచ్చేవారు. డీసీఎంఎస్‌లు అందుబాటులో ఉన్నంత కాలం ప్రైవేటు ఎజెన్సీలు సరైన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించేవారు. దీంతో రైతులకు మేలు జరిగేది. మెల్లమెల్లగా సహకార మార్కెట్‌ సంఘాలు రైతులకు దూరమవుతూ వచ్చాయి. మొదట మండల కేంద్రాల్లో వీటి సేవలు నిలిచిపోగా తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ డీసీఎంఎస్‌లకు స్వస్తి పలకడం రైతులకు శాపంగా మారింది. దీంతో అన్నదాతలు తప్పనిసరిగా ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన కందులను పప్పుగా మార్చి తాండూరు కంది పప్పు పేరుతో విక్రయిస్తూ సంస్థ లాభాలు ఆర్జిస్తోంది. డీసీఎంఎస్‌ సేవలకు స్వస్తి పలకడంతో ఇందులో పని చేసే ఉద్యోగులకు పని లేకుండా పోయింది. దీంతో వారు తమ సొంత పనులు చక్కబెడుతూ, ఇతర వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు.

గతంలో కేటాయించారు

వికారాబాద్‌ పట్టణంలోని డీసీఎంఎస్‌కు చెందిన దుకాణాలు, గోదాంలను నేను బాధ్యతలు తీసుకోకముందే అద్దెకు ఇచ్చారు. గతంలో వీటిలో ఎరువులు, విత్తనాలు విక్రయించే వాళ్లం. వీటిని అద్దెకు ఇవ్వడంతో మాకు పనిలేకుండా పోయింది.

– ఎల్లయ్య, బ్రాంచ్‌ మేనేజర్‌, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement