ధారూరు: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోతులు, అడవి పందుల బెడద వాటి నివారణ, పంటల యాజమాన్యం, వానాకాలం, యాసంగి పంటల సాగు మెళకువలను రైతులకు శాస్త్రవేత్తలు వివరంచనున్నారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొంటారని, ధారూరు రైతు క్లస్టర్ పరిధిలోని రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు నాయకులు తెలిపారు.
రుణాలు సకాలంలో
చెల్లించండి
కొడంగల్: ప్రాథమిక సహకార సంఘంలో రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఏసీఎస్ సహకార సంఘం ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు, పంట రుణాలు, స్పల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మార్చి 31 లోపు పంట రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. రెన్యూవల్ చేయించని ఎడల ఏడు శాతం, సకాలంలో రుణాలు చెల్లించని వారికి 13 శాతం వడ్డీ పడుతుందన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
అనంతగిరి: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మా శారద ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రాజశేఖర్‌ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు సాధు సత్యనాథన్, కార్యదర్శి శ్రీకాంత్, మధుసూదన్‌రెడ్డి, పవన్‌కుమార్, శాంతప్ప, శ్రవణ్, జయంతిక, ఆశాజ్యోతి, రమ్య, గిరీష, సుఖప్రద తదితరులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో జింక మృత్యువాత
దోమ: కుక్కల దాడిలో జింక మృత్యువాత పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆదివారం స్థానిక చెరువులో నీరు తాగేందుకు వచ్చిన జింకను చూసిన వీధి కుక్కలు వెంబడించి దాడి చేయడంతో జింక మృత్యువాతపడింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో జంతువులకు సమృద్ధిగా తాగునీరు ఏర్పాటుచేయకపోవడం వల్లనే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం–హైదరాబాద్ రహదారిని విస్తరించండి
కడ్తాల్: శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర నాయకుడు ఆచారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి (ఎన్‌హెచ్765) రద్దీగా మారిందని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విస్తరణతో రద్దీని, ప్రమాదాలను నివారించొచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రోడ్డుకు సంబంధించి డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలాల్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్‌దోనాదుల, కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.