● కలెక్టర్ ప్రతీక్‌జైన్ ● హకీంపేట్ రైతులతో సమావేశం ● ఒకే విడతలో పరిహారం అందజేస్తామని వెల్లడి
అనంతగిరి: పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒకే విడతలో పరిహారం అందజేస్తుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు దుద్యాల్ మండలం హకీంపేట్ రైతులతో సమావేశమయ్యారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన 114 మంది రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హకీంపేట్‌లో 146.34 గుంటల పట్టాభూమి ఉందని తెలిపారు. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తామన్నారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారం పరిహారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు, అర్హత ఆధారంగా ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ , తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, దుద్యాల్ మండలం తహసీల్దార్ కిషన్, హకీంపేట రైతులు పాల్గొన్నారు.