● అసెంబ్లీ సమావేశాల్లోతాండూరు సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తాండూరు మున్సిపాలిటీ చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తాండూరు సమస్యలను వినిపించారు. 1953లో తాండూరు మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మూడు సిమెంట్ కర్మాగారాలు, నాపరాతి గనులు, పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు, ప్రజలు వచ్చి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత పాలకులు మున్సిపాలిటీలో జనాభాకు తగ్గట్లు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. చిన్నపాటి వర్షం వచ్చినా పట్టణ పరిధిలోని సాయిపూర్, శాంతినగర్, హైదరాబాద్ మార్గంలోని ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. చిలుక వాగును ప్రక్షాళన చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధిత శాఖ మంత్రులు నిధులు కేటాయించాలని కోరారు. తాండూరు ప్రాంతానికి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోందని.. చాలా దూరం నుంచి నీటి సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాండూరుకు పక్కనే ఉన్న కగ్నానదిలో 1965లో తాగునీటి కోసం పంప్‌హౌస్ నిర్మించారని.. తరచూ మోటార్లు కాలిపోతున్నాయని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే చెప్పిన వివరాలను నోట్ చేసుకోన్నట్లు పేర్కొన్నారు.