
పూజల పేరిట మోసాలు నకిలీ బాబా అరెస్టు
కాచిగూడ: ‘మీ జాతకం బాగాలేదు..శాంతి పూజలు చేయాలి’ అంటూ ఓ మహిళకు మాయమాటలు చెప్పి అందిన కాడికి బంగారం, నగదుతో ఉడాయించిన బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్యతో కలిసి డీసీపీ డాక్టర్ బాలస్వామి వివరాలు వెల్లడించారు. ఎల్‌బీ నగర్‌లోని రాక్ టౌన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు అరిగెల సాంబశివుడు (45) అలియాస్ గురూజీ శివస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్‌తో దొంగబాబా అవతారం ఎత్తాడు. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన గీతా వైద్య దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. సంవత్సరం క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సౌమ్య ద్వారా గీతకు సాంబశివుడు పరిచయమయ్యాడు. మీ ఇంటికి దోషం ఉందని, మీ పేరు మీద బాగాలేదని ముందు ముందు చాలా ఇబ్బందులు పడతారని, మీ భర్త చనిపోయినట్లే మీ కుటుంబం అంతా చనిపోతారని భయపెట్టాడు. దోషం పోవాలంటే పూజలు చేయించాలని, ఇందుకు రూ.1.70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అనంతరం కొద్దిరోజులకు మళ్లీ మీ కూతురికి పెళ్లయితే విడాకులు అవుతాయని, అందుకు దోష నివారణకు పూజలు చేయాలని, దానికి లక్షలు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పాడు. దీంతో భయపడిన గీత తన దగ్గర ఉన్న 26 తులాల బంగారు నగలు ఇచ్చింది. అదే కాకుండా ఆమె ఇంటి పత్రాలను కూడా ఇచ్చింది. ఈ దశలో అనుమానం వచ్చిన గీతా వైద్య కూతురు ప్రతిఘటించి దొంగ బాబా దగ్గర ఇంటి పత్రాలను తిరిగి తీసుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు సాంబశివుడిని అదుపులోకి తీసుకొని అతనివద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.