చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని.. | Woman found dead under mysterious circumstances at Vizag RK Beach | Sakshi
Sakshi News home page

చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని..

Published Thu, Apr 27 2023 6:36 AM | Last Updated on Thu, Apr 27 2023 6:36 AM

Woman found dead under mysterious circumstances at Vizag RK Beach - Sakshi

విశాఖపట్నం: ‘చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏ మాత్రం ఫరక్‌ పడదు. ఎనీ వే ఆల్‌ ద బెస్ట్‌ ఫర్‌ యువర్‌ ఫ్యూచర్‌ అండ్‌ న్యూ లైఫ్‌. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్‌.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీ థింగ్‌. జస్ట్‌ క్వశ్చన్‌ యువర్‌ సెల్ఫ్‌. ఏ బిగ్‌ థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్‌’ అంటూ భర్తకు లేఖ రాసి ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆమె..ఆర్‌.కె.బీచ్‌లో విగతజీవిగా కనిపించింది. వరకట్న వేధింపులే తన కుమార్తె మరణానికి కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ..

పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్‌ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు.

మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి పెట్రోలింగ్‌ చేసే పోలీసుల గ్రూపులో ఆమె ఫొటో పోస్ట్‌ చేసి అదృశ్యమైందని వివరాలు పెట్టారు.

అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్‌.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుకలో కూరుకుపోయిన ఆమె మృతదేహాన్ని చూసి.. ఎవరో హత్య చేసి తీరంలో పూడ్చేసినట్లు ముందు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

వివాహమై ఏడాది పూర్తి
శ్వేత, మణికంఠ దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవం ఈ నెల 15న జరిగింది. అనంతరం మణికంఠ హైదరాబాద్‌ వెళ్లాడు. శ్వేత మరణ వార్త తెలియగానే వెంటనే నగరానికి చేరుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ ఫర్‌ యువర్‌ ఫ్యూచర్‌. బిగ్‌ థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్‌ అని రాసి ఉంది.

భర్త ప్రేమకు నోచుకోలేదు
పెళ్లి అయిన తర్వాత అత్త, మామ, ఆడపడుచు భర్త ఎంతగానో నా బిడ్డను వేధించారని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. ‘ఆ ఇంట్లో ఉండలేకపోతే వచ్చేయమ్మా.. పెంచుకుంటా అని చెప్పాను. అయినా సరే భర్త ప్రేమ కోసం ఆ ఇంట్లోనే ఉంది. ఐదు నెలల గర్భంతో ఉన్న నా కుమార్తైపె కనీసం కనికరం లేకుండా అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించారు. అల్లుడు వాళ్ల అమ్మానాన్నలకే వత్తాసు పలికేవాడు. ప్రతి రోజూ ఫోన్‌ చేసి ఏడ్చేది. నెల రోజుల కిందట విడాకులు ఇస్తామని శ్వేతను మణికంఠ బెదిరించాడు.

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పింది. పైళ్లెన తర్వాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. నా ఒక్కగానొక్క కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ ఆమె వాపోయారు. వరకట్నం వేధింపులే తన కుమార్తెకు మరణానికి కారణామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం తీసుకురావాలని కొద్ది నెలలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు.

ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించా..
‘శ్వేత బి.టెక్‌ సివిల్‌ ఇంజినీర్‌ చదువుకుంది. సివిల్స్‌ సాధించాలని నిరంతరం చదువుకునేది. అందుకు నేను కూడా ప్రోత్సహించా. కుటుంబంలో చిన్న చిన్న గొడవులు సహజం. ఆ మాత్రానికే ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించాను. ఇలా శవమై మమ్మల్ని బాధపెట్టింది’ అని మణికంఠ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement