రితీ సాహా (ఫైల్)
విశాఖపట్నం: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. తమ కుమార్తెది హత్యేనని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనంగా మారింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యార్థిని రితీ సాహా హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందితే.. పశ్చిమ బెంగాల్‌లో నేతాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితీ సాహా విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కాలేజీకి అనుసంధానంగా నెహ్రూబజార్ ప్రాంతంలో ఉన్న సాధనా హాస్టల్‌లో ఉండేది. ఈ క్రమంలో గత నెల 14న హాస్టల్ 4వ అంతస్తు పైనుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం సమాచారమిచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు విశాఖకు వచ్చి విగత జీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. అయితే విద్యార్థిని మరణానికి గల కారణాలపై హాస్టల్ సిబ్బంది, పోలీసులు పొంతన లేకుండా చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. ఒకసారి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని, మరోసారి దూకేసిందంటూ చెప్పుకొచ్చారు.
సీసీ ఫుటేజ్‌లతో మరిన్ని అనుమానాలు
రీతి సాహా మృతిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉన్న సీసీ కెమెరాలనే కాకుండా దాని ఎదురుగా ఉన్న భవనం సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. రితీ సాహా నాలుగో అంతస్తు పైకి వెళ్లే సమయంలో ఒక డ్రెస్‌లో ఉండగా.. కింద పడి ఉన్న మృతదేహంపై మరో కలర్ డ్రెస్ ఉందని గ్రహించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం సీరియస్ అవడంతో పాటు మంత్రి అనూప్‌ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా సీఎం ఆదేశాలతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో సంఘటన జరిగితే మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం అరుదు. కానీ రితీ సాహా అనుమానాస్పద మృతిపై బెంగాల్‌లో కేసు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది.
కేసును నీరుగార్చే ప్రయత్నం?
రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్, హాస్టల్ నిర్వాహకుల నుంచి స్థానిక పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డీసీపీ విద్యాసాగర్‌నాయుడును ఆదేశించినట్లు సమాచారం.
వారంలో ఫోరెన్సిక్ నివేదిక
ఈ కేసుపై డీసీపీ–1 విద్యాసాగర్‌నాయుడును మీడియా ప్రశ్నించగా.. రితీ సాహా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక మరో వారం రోజుల్లో వస్తుందని దాని ప్రకారం తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment