విశాఖ నూతన పోలీస్‌ కమిషనర్‌గా డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖ నూతన పోలీస్‌ కమిషనర్‌గా డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌

Published Wed, Sep 6 2023 1:08 AM | Last Updated on Wed, Sep 6 2023 9:51 AM

- - Sakshi

దొండపర్తి : విశాఖ నూతన పోలీస్‌ కమిషనర్‌గా డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ్‌ వర్మ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే డీసీపీ(లా అండ్‌ ఆర్డర్‌)గా ఉన్న వి.విద్యాసాగర్‌నాయుడును గ్రేహౌండ్స్‌ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అనంతపురం ఎస్పీగా ఉన్న కంచి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈయన గతంలో విశాఖ డీసీపీగా విధులు నిర్వర్తించారు.

సమర్ధవంతమైన అధికారిగా రవిశంకర్‌

 
1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రవిశంకర్‌ అయ్యనార్‌ పనిచేసిన ప్రతి చోటా సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.

► 1968 అక్టోబర్‌ 20న ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో జన్మించిన రవిశంకర్‌ పుదుచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, సింబయాసిస్‌ యూనివర్సిటీలో హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లమో చేశారు. కొన్నాళ్లు జిప్‌మర్‌లో క్యాజువాలిటీ ఎమర్జన్సీ మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.

► 1994లో ఐపీఎస్‌గా ఎంపికై న తరువాత 1996 గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా నియమితులయ్యారు.

1997–98లో బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ ఏఎస్పీగా సింగరేణి బెల్ట్‌లో గెరిల్లా ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించి మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

1998–99లో వరంగల్‌ ఓఎస్‌డీగా మావోయిస్టు చర్యల నిరోధానికి చట్టపరమైన, సంస్థాగత ప్రణాళికలు రూపొందించారు. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల మీదుగా మావోయిస్టుల రాకపోకలు, తప్పించుకొనే మార్గాలు, ఆశ్రయ స్థలాలు, శిక్షణా శిబిరాలను సెస్నా ఎయిర్‌క్రాఫ్‌, జీపీఎస్‌ ద్వారా మ్యాప్‌ చేశారు.

1999–2002 వరకు నిజామాబాద్‌ ఎస్పీగా పాకిస్తాన్‌కు చెందిన రెసిడెంట్‌ ఏజెంట్‌ ఆషిక్‌ అలీపై జీహాదీ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. అలాగే ఇండియన్‌ మహ్మద్‌ ముస్లిమిన్‌ ముజాహిదీన్‌ మాడ్యూల్‌ను ఛేదిండంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

2002లో హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీగాను, 2002–2004 మధ్య గుంటూరు ఎస్పీగాను పనిచేశారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన ఐఈడీ బ్లాస్ట్‌ కేసును దర్యాప్తు చేశారు.

2004–2005లో కొసావోలో యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ సీరియస్‌ క్రైమ్స్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ ఇన్వెస్టిగేటర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో కొసావో పోలీస్‌ ఆఫీసర్‌ హత్యకేసు, అక్రమ ఆయుధాల కేసు, కొసావో అధ్యక్షుడు హరదినాజ్‌పై హత్యాయత్నం కేసుతో పాటు మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం కేసుల దర్యాప్తు చేపట్టారు.

2005–2006లో హైదరాబాద్‌ లా అండ్‌ ఆర్డర్‌ ఏఐజీగాను, 2006–2008 మధ్య స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌, 2008–2009లో ఏసీబీ అడిషినల్‌ డైరెక్టర్‌గాను, 2009–2010లో కరీంనగర్‌/వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా విధులు నిర్వర్తించారు.

2010–2015 మధ్య నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డీఐజీగా ఇండియన్‌ ముజాహుద్దీన్‌(ఐఎం) భారీ పేలుళ్ల కేసు, దిల్‌సుఖ్‌నగర్‌, మక్కా మస్జిద్‌, మాలేగాన్‌, బెంగుళూరు చర్చి, అజ్మీర్‌ దర్గా పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అలాగే నకిలీ కరెన్సీ కేసులు, టెర్రర్‌ ఫైనాన్స్‌ కేసుల్లో జాతీయ, అంతర్జాతీయ లింకులు, మావోయిస్ట్‌ ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ కేసులు, ఇటాలియన్‌ మైరెన్‌ కేసు ఇలా అనేక కీలక కేసులను దర్యాప్తు చేశారు.

2015–2018 మధ్య డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా, 2015–2018లో ఆరోగ్యశ్రీ సీఈఓగా, 2018–2019లో ప్రావిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో ఐజీగా, 2019లో లా అండ్‌ ఆర్డర్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.

ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న రవిశంకర్‌ విశాఖ సీపీగా నియమితులయ్యారు.

కొత్త డీసీపీ స్వస్థలం ఉమ్మడి విశాఖే..
విశాఖ డీసీపీ(లా అండ్‌ ఆర్డర్‌)గా రానున్న కంచి శ్రీనివాసరావు విశాఖతో అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. 2009 గ్రూప్‌–1 ద్వారా డీఎస్పీ పోస్టు సాధించారు. తొలుత వనపర్తి, కొవ్వూరులో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సీఐడీ డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్‌ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందాక విశాఖపట్నం డీసీపీగా, శ్రీకాకుళం అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మరోసారి ఉద్యోగోన్నతి పొంది విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నారు. అక్కడి నుంచి విశాఖ డీసీపీగా నియమితులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement