సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు అధినేత అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొట్టిన దెబ్బకు కోలుకోలేక మధనపడుతున్న అయ్యన్నకు.. ఇంటి పోరు మరింత తలపోటుగా మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వారసత్వంగా కొడుకును నర్సీపట్నం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించాలంటూ ఒత్తిడి అధికం కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రానున్న ఎన్నికల్లో కొడుకును బరిలోకి దించకపోతే తన రాజకీయ వారసత్వం కష్టమనే భావనలో అయ్యన్న ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక అయ్యన్న నోటికి తాళం పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కోసం అయ్యన్న తీవ్రంగా కష్టపడ్డారు. నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన అధికార వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పించారు. అధినేత దృష్టిలో ఉంటూ అనకాపల్లి ఎంపీ సీటును కొడుకుకు వచ్చేలా యత్నించారు. అయితే, ఎన్నికలు వచ్చేసరికి వ్యాపారవేత్తలు, పైసలు ఉన్నవారికే సీటు ఇచ్చే అలవాటున్న చంద్రబాబు ఈసారి మారారనే భావనలో అయ్యన్న ఉన్నారు. తీరా ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి యథావిధిగా అనకాపల్లి ఎంపీ సీటును బాగా ఖర్చు చేయగలిగిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ వారసత్వం కోసం నర్సీపట్నం నుంచి కొడుకును బరిలోకి దించాలంటూ ఇంటి పోరు రోజురోజుకీ ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది.
కొడుకు పోరుతో విలవిల
వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ ఇంటి పోరు అధికమైనట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడిన అయ్యన్న ఓటమి తర్వాతైనా గుణపాఠం నేర్చుకుంటారని అందరూ భావించారు. అయితే, అయ్యన్న బుద్ధి మాత్రం మారలేదు. సరికదా ఓటమి బాధలో మరింతగా దిగజారి మాట్లాడటం ప్రారంభించారు. ఫలితంగా నియోజకవర్గంలో అయ్యన్నకు ఏ మాత్రమూ పట్టుపెరగడం లేదు.
మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాదరహితుడు కావడం... తాజాగా జరిగిన సాధికార యాత్ర విజయవంతం కావడం వల్ల మరోసారి వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా 2024 ఎన్నికల్లోనే కుమారుడిని బరిలోకి నిలిపేలా ఇంటి పోరు ఎక్కువవుతోందని సమాచారం. 2029 ఎన్నికల వరకూ వేచిచూడటం కష్టమంటూ కుమారుడికి మద్దతుగా అయ్యన్న సతీమణి కూడా గొంతు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అధినేత వైఖరితో తలబొప్పి కట్టిన అయ్యన్నకు... ఇంటి పోరు మరింత తలపోటుగా మారింది. కొడుకును బరిలోకి దింపి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకుంటారా లేదా అనేది త్వరలో తేలనుంది.
రాజకీయ వారసత్వం కష్టమే..
వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా తనకు ఆరోగ్యం, వయస్సు సహకరించిన సమయంలోనే తన వారసత్వాన్ని రాజకీయాల్లో దించటం సహజ పరిణామం. తీరా వయస్సు అయిపోయిన తర్వాత వారసత్వాన్ని రంగంలోకి దించితే గెలిపించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రాజకీయ నాయకులు తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు. అయితే అయ్యన్న నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై దాటవేస్తూ వస్తున్నారు.
కొద్దిరోజుల ముందు భారీగా ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దీంతో పార్టీ కోసం కష్టపడితే ఇదేనా నాకిచ్చే గౌరవమంటూ ఆయన లోలోపల మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే పరిస్థితుల్లో నర్సీపట్నం నుంచి తాను రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల వరకు అంటే 2029 వరకూ రాజకీయ వారసత్వం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపించనప్పటికీ కొడుకును బరిలో నిలపడం ద్వారా రాజకీయ వారసత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment