
న్యాయవాదులకు పుట్టినిల్లు విశాఖ
● విశాఖ న్యాయవాదుల సంఘానికి ఉజ్వల భవిష్యత్ ● సుప్రీంకోర్టు న్యాయమూర్తిసరస వెంకట నారాయణ భట్
విశాఖ లీగల్: వందేళ్ల పండగకు సిద్ధమవుతున్న విశాఖ న్యాయవాదుల సంఘానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాద సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంతో విస్తరిస్తున్న విశాఖ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. విశాఖ న్యాయవాదులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందని.. డి.వి.సుబ్బారావు వంటి న్యాయ కోవిదులు విశాఖవాసులు కావడం అదృష్టంగా అభివర్ణించారు. విశాఖను ప్రముఖ న్యాయవాదులకు పుట్టినిల్లుగా వివరించారు. 1989 నుంచి తనకు విశాఖతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. వందేళ్ల పండగకు తాను వస్తానని చెప్పారు. న్యాయవాదుల సేవలను ప్రస్తుతించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బేవర సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ నగరం హైకోర్టు బెంచ్‌తో పాటు కేంద్ర ట్రిబ్యునల్ ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలమైనదిగా చెప్పారు. విశాఖకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను సఫలం చేసే విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమాన్ని కార్యదర్శి డి.నరేష్ ప్రారంభించగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.నర్సింగరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరావు, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డి.వి.వి.ఎస్.సోమయాజులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment