తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీగౌర పూర్ణిమ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ భక్తులు ముందుగా శీకృష్ణబలరాముల విగ్రహాలకు, అనంతరం శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువుకు పంచామృతాలు, పంచగంధ్య, సువాసనలతో కూడిన పుష్పాలు, వివిధ పండ్ల రసాలతో మహా అభిషేకం నిర్వహించారు. స్వామి వారికి విశేషంగా పిండి వంటలతో నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేడుకలను అంబరీష దాస పర్యవేక్షించారు. అనంతరం హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస గౌరలీల గురించి ప్రవచించారు.