మద్దిలపాలెం: ప్రముఖ ఆంధ్ర భాషా ఆచార్యులు, అభినవ మొల్ల, ఆచార్య కోలవెన్ను మలయవాసినికి సాహిత్య కళా భారతి బిరుదు ప్రదానం ఘనంగా జరిగింది. విశాఖ మ్యూజిక్, డాన్స్ అకాడమీ(వీఎండీఏ), కళాభారతి నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, ట్రస్టీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె.ప్రసాద్, కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్‌లు.. విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు పిళ్లా వెంకట రమణమూర్తి రాసి చదివిన సన్మాన పత్రం, నూతన వస్త్రాలు, నగదు పురస్కారంతో ఆచార్య మలయవాసిని దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఆచార్య కోలవెన్ను మలయవాసినికి సాహిత్య కళా భారతి బిరుదు ప్రదానం చేసిన సభలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సత్కార గ్రహీత ఆచార్య మలయవాసిని తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ గుమ్మలూరి ఇందిర రచించిన ‘మన రాముడు’అనే పుస్తకాన్ని రఘునాథ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డాక్టర్ పేరి రవికుమార్ పుస్తక సమీక్ష చేశారు.