‘వైఎస్సార్’ పేరు చూస్తే ‘కూటమి’లో కలవరం
● ప్రతిచోటా ఆయన పేరును తొలగిస్తున్నారు ● ప్రజల గుండెల్లో మాత్రం ఆయన స్థానాన్ని చెరపలేరు ● విశాఖ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరు తొలగించడం దుర్మార్గం ● నేడు స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన ● మీడియాతో మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును చూసి టీడీపీ కూటమి సర్కారు కలవరపడుతోందని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ వరుసగా తొలగిస్తూ వస్తున్నారన్నారు. వైఎస్సార్ పేరు అయితే చెరిపేయగలరుగానీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ఉన్న ఆ పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని.. వైఎస్సార్ అనే బ్రాండ్ కనిపించకుండా చేయాలన్న కుతంత్రమే కనిపిస్తోంది. నాగార్జున యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు.. బాపట్ల జిల్లా వేమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించారు.. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరును తీసేశారు.. చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న ‘వైఎస్సార్’ పేరునూ దుర్మార్గంగా తొలగించారు. అలాగే, వైఎస్ జగన్ సీఎంగా ఉండగా సీతకొండను అభివృద్ధిచేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కూడా తీసేశారు. అలాగే, వైఎస్సార్ జిల్లా పేరును మార్చేశారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్సార్ పేరును రైతుభరోసా కేంద్రాలకు పెడితే, వాటినీ నిర్వీర్యం చేశారు. చివరికి.. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీకి వున్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు.
జగన్ పేరునూ తీసేశారు..
ఇక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా విజయవాడ నడిబొడ్డున 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం నిర్మిస్తే దానిపైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును తీసేశారు. వైఎస్సార్ పేరు కనపడితేనే ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు.. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసి కూడా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు? వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎన్టీఆర్‌కు సమున్నత గౌరవం కల్పించారు. ఇక విశాఖ వీడీసీఏ క్రికెట్ స్టేడియానికున్న వైఎస్సార్ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 20న ఉ.10 గంటలకు స్టేడియం వద్ద శాంతియుతంగా నిరసన చేపడతాం. ఈ నెలాఖరున ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నందున ప్రభుత్వం, ఏసీఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వైఎస్సార్ పేరును కొనసాగించాలి.
Comments
Please login to add a commentAdd a comment