హే పిచ్చుక.. తిరిగి రావాలిక.!
పక్షుల కోసం ఏర్పాటు చేసే వరి కంకులతో నగర ప్రజలు, గ్రీన్ క్లైమేట్ సభ్యులు
ఏయూక్యాంపస్: స్వేచ్ఛకు, సంతోషానికి, ప్రకృతి అందానికి చిహ్నాలు పిచ్చుకలు. కానీ, వాటి గురించి ప్రస్తుత కాలం పిల్లలకు తెలుసో తెలియదో మరి!. ఒకప్పుడు మన పూరి గుడిసెల్లో, మనతోనే కలిసిమెలిసి జీవించేవి ఈ చిట్టి పక్షులు. మన కిటికీ పక్కనో.. పెరట్లోని చెట్టుపైనో వాటి కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన రోజులు చాలానే ఉంటాయి. ఇప్పుడా గుడిసెలు లేవు.. వాటికి గూడు కట్టుకోవడానికి చోటూ లేదు.. ఫలితంగా పిచ్చుకలూ లేవు. కాలం మారింది. మన అవసరాలు పెరిగాయి. చిన్న గుడిసె స్థానంలో పెద్ద భవంతులు వచ్చాయి. మన ఆశలు పెరిగాయి. కానీ మనకు సహాయపడే ఇతర జీవులతో మన ఆత్మీయత తగ్గిపోయింది. మన అవసరాల కోసం వాటిని అంతం చేస్తున్నాం. ఏటా మార్చి 20న మ నం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతరించిపోతున్న ఈ పక్షుల గురించి తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత.
పిచ్చుకలు చూడ్డానికి బుల్లి పిట్టలే కానీ.. పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో కీటకాలను తినేసి.. మొక్కలను తెగుళ్లు, చీడ పీడల నుంచి కాపాడతాయి. విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇవి ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వెళ్లే సమయంలో పరోక్షంగా పరాగ సంపర్కం జరగడానికి దోహదపడతాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు. నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా మారాయి. పంట పొలాల్లో పురుగు మందుల వాడకం, ఆహారం లభించకపోవడం, గూడు కట్టుకోవడానికి సరైన ప్రదేశాలు లేకపోవడం వంటి కారణాల వల్ల వాటి మనుగడ కష్టతరమవుతోంది. ఇళ్లలో మొక్కలు పెంచే సంస్కృతి తగ్గిపోవడం కూడా మరో కారణం.
ప్రతిజ్ఞ చేద్దాం
ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన వంతుగా పిచ్చుకలను కాపాడుకుందాం. బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్‌ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణ ధాన్యాలను వాటికి ఆహారంగా అందిద్దాం. హే పిచ్చుక.. గూడు కట్టుకో.. అని ఆహ్వానిద్దాం! తద్వారా మన భవిష్యత్ తరాలకు ఈ అందమైన పక్షులను పరిచయం చేద్దాం.
హే పిచ్చుక.. తిరిగి రావాలిక.!
Comments
Please login to add a commentAdd a comment