సీతమ్మధార: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ విశాఖలో ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు. యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. వీరికి పలు రాజకీయ పార్టీలు, హిందూ, క్రిస్టియన్, సిక్కు, ఆవాజ్, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ గంగారావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణలు చేపట్టిందని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు పూర్తిగా ముస్లింలకు చెందిన ప్రైవేట్ భూములన్నారు. సిక్కు సంఘం నేత సచ్చేంద్ర సింగ్ మాట్లాడుతూ తక్షణం బిల్లును ఉపసంహరించుకోకపోతే దేశంలో లౌకికవాదం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం నేత అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీల కంటే ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయన్నారు. తక్షణం వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ప్రెసిడెంట్ అబ్దుల్ మున్నన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాస్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ అహ్మద్, స్టేట్ మైనారిటీ యూత్ లీడర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ గొల్లపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.