● మెడికల్ షాప్‌లు, ఏజెన్సీల్లో అడుగడుగునా అక్రమాలు ● కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రాణాలతో చెలగాటం ● విజిలెన్స్, పోలీస్, ఈగల్, డ్రగ్ కంట్రోల్ బృందాల తనిఖీల్లో వెల్లడి
మహారాణిపేట: వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం రోగుల పాలిట శాపంగా మారింది. కాలం చెల్లిన మందుల విక్రయాలు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తునిచ్చే మందులు, ఇంజక్షన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన మెడికల్ షాపులు, ఏజెన్సీలు అడ్డగోలుగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోని పరిస్థితి.
నిబంధనలు బేఖాతరు
ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 3 వేల మందుల షాపులు, 1,400 మెడికల్ ఏజెన్సీలు, హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న షాపుల్లో ఎలాంటి కంప్యూటర్లు, రిజిస్టర్లు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు ప్రతి మందుల షాపులో ఫార్మసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరగాలి. కానీ ఎక్కడా ఈ నిబంధన అమలు జరగట్లేదు. అయినా ఔషధ నియంత్రణ మండలి అధికారులు మాత్రం దృష్టి సారించరు. నెలనెలా తూతూ మంత్రపు తనిఖీలతో ‘మామూళ్లు’గా మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఠంచనుగా జరపాల్సిన తనిఖీలు జరగకపోవడంతో చాలా మందుల షాపులు కనీస నిబంధనలను కూడా పాటించట్లేదు. కాలం చెల్లిన మందుల్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
అడ్డగోలుతనం బట్టబయలు
మెడికల్ షాపుల అడ్డగోలుతనంపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ కింజరాపు ప్రభాకర్, ఈగల్(ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్), డ్రగ్ కంట్రోల్, ఇతర విభాగాలకు చెందిన 40 మంది సభ్యులతో కూడిన 4 బృందాలు మందులు షాపులు, ఎజెన్సీల్లో తనిఖీలు చేపట్టాయి. ఆరిలోవ, అల్లిపురం, లీలా మహల్, డాబాగార్డెన్స్, కై లాసపురం, కూర్మన్నపాలెం, గాజువాక, అనకాపల్లి, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్స్, గాజువాకలోని శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్స్‌లో మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కనీస నిబంధనలు పాటించని మరో 13 షాపులకు నోటీసులిచ్చి సరిపెట్టారు.