మహారాణిపేట: గ్రోత్ హబ్ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న మూడో విడత కలెక్టర్ల సదస్సులో రెండో రోజు బుధవారం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం రీజియన్ గ్రోత్ హబ్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టబోయే చర్యల గురించి సీఎంకు వివరించారు. గ్రోత్ హబ్ కార్యసాధనలో భాగంగా విశాఖ రీజియన్‌లో నిర్దేశించిన 715 బిలియన్ డాలర్ల లక్ష్యం చేరుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో రీజియన్ వాటా 15.7 శాతం అనగా రూ.1,45,774 కోట్లు ఉండేలా కృషి చేస్తామని, తలసరి ఆదాయం రూ.6,14,763 సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక రంగంలో రెట్టింపు వృద్ధి లక్ష్యాలు చేరుకుంటామని చెప్పారు. జిల్లాలో రంగాల వారీగా చూసినట్లయితే జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, దీన్ని 10 శాతానికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. నగదు రూపంలో చూస్తే రూ.68 కోట్ల మేర మాత్రమే వ్యవసాయ రంగం వాటా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో అనేక కారణాల వల్ల సుమారు రెండు వేల హెక్టార్ల బీడు భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వచ్చే ఏడాదిలో 200 హెక్టార్ల బీడు భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు. వరి, చిరు ధాన్యాల సాగులో వినూత్న సంస్కరణలు చేపడతామని, కొత్త వంగడాలను ప్రవేశపెడతామన్నారు. వరిలో ఎంటీయూ–1224, ఆర్.ఎన్.ఆర్.–15048 వంటి వంగడాలను, మిల్లెట్లలో ఇంద్రావతి, వేగవతి వంటి నూతన రకాలను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఉత్పాదకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్