● మానసిక ఆస్పత్రిలో కొనసాగుతున్న పరీక్షలు ● పింఛన్ల కోతకు కూటమి సర్కార్ కుట్ర?
మహారాణిపేట: నెలకు ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్న మానసిక దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు దివ్యాంగులకు భారీగా పింఛన్లు పెంచుతామని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారంలోకి రాగానే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రపూరితంగా సర్వేలు చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో జరుగుతున్న తనిఖీలే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మానసిక దివ్యాంగులను బలవంతంగా ఆస్పత్రులకు రప్పించి, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులచే పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ.. మళ్లీ మళ్లీ తనిఖీలు నిర్వహించడం దివ్యాంగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు సదరం సర్టిఫికెట్ల పరిశీలన, మరోవైపు వైద్య పరీక్షల పేరుతో జరుగుతున్న ఈ తతంగాన్ని దివ్యాంగుల పెన్షన్ల కోత కోసమేనని అనుమానిస్తున్నారు.
రోజుకు 20 మంది తనిఖీ : మానసిక ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే ఆస్పత్రిలో మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి.. అక్కడ రోగులకు వివిధ పరీక్షలు చేయిస్తున్నారు. రోజుకు 20 మంది రోగులకు చొప్పున తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేఏశారు. కాగా.. గురువారం 20 మంది మానసిక దివ్యాంగుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం వైద్యులు వారికి కేటాయించిన శాతంను వివిధ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారు.
మనోవేదనలో దివ్యాంగులు
చిన్నవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో జరిగిన తనిఖీలకు హాజరైన దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న తమకు ఇప్పుడు మళ్లీ పరీక్షలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల దుస్థితి చూసి బాధపడుతుంటే.. ఇలాంటి చర్యలతో మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో కారణం చెప్పి పింఛన్లు తొలగించాలనే దురుద్దేశంతోనే ఈ సర్వేలు, తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం జిల్లాలో నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న 4,408 మంది మానసిక దివ్యాంగులకు నోటీసులు జారీ చేసి.. పరీక్షలకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు, మంచంపై ఉన్న వారిని దశలవారీగా పరిశీలించనున్నారు.
ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు
మా అమ్మాయి పుట్టుకతో ఎలా ఉందో.. మానసికంగా ఇప్పుడూ అలానే ఉంది. మనిషిలో ఎదుగుదల లేదు. తిండి పెడితే తింటుంది. లేకపోతే లేదు. ఏమీ తెలియదు. స్నానం చేయించడం, దుస్తులు వేయడం, ఆహారం తినిపించడం అన్నీ మేమే చేస్తున్నాం. అమ్మాయిని ఇంత దూరం తీసుకురావడానికి ఇద్దరం ఉండాల్సి వచ్చింది. వైద్యులు చూస్తారని చెప్పడంతో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక ఏదో చెబుతున్నారు. ఏం అర్థం కాలేదు.
– శ్రీనివాస్, వెంకట లక్ష్మి దంపతులు, రామలక్ష్మి తల్లిదండ్రులు, శ్రీహరిపురం
వైద్య పరీక్షం కోసం వేచి ఉన్న దివ్యాంగులు
మానసిక దివ్యాంగులపై కక్ష
మానసిక దివ్యాంగులపై కక్ష