● మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
మద్దిలపాలెం: మన సంస్కృతిలో భాగమైన తెలుగు నాటకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేలా కళాకారులు కృషి చేయాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నాటక దినోత్సవం సందర్భంగా కళాభారతి ఆడిటోరియంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ‘లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు–2025’ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు నాటకాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు నాటక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతీయ స్థాయిలో ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఆరు నెలల్లో రాష్ట్రానికి తీసుకువస్తామన్నారు. ఈ ఏడాది నాటకాలకు, సినిమాలకు నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి బళ్లారి రాఘవ చేసిన సేవలను కొనియాడారు. విశాఖలో కళాపోషకులు, కళా ప్రియులు, కళాకారులు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. 60 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా పలు నాటకాల్లో నటించిన విజయలక్ష్మికి అవార్డు అందజేయాల్సి ఉండగా.. ఆమె రాకపోవడంతో చలసాని కృష్ణప్రసాద్‌కు మంత్రి దుర్గేష్ అందజేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు, నాటకాల ఎంపిక కమిటీ సభ్యుడు శివప్రసాద్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన గుజరాతీ నాటకం ‘ఐటెం’ఆకట్టుకుంది. భాషాపరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ.. నటుల ప్రదర్శనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. రచయిత, దర్శకుడు అర్పిల్ దాగత్, నటులను మంత్రి దుర్గేష్ సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.