
ఒక్కో వ్యక్తికి ఒక్కో పోలీసును పెట్టాలా.. హోం మంత్రి అన
● జగన్ భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలు ● సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన హోం మంత్రి
విశాఖ సిటీ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. వారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చిందులు తొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు జగన్ పర్యటనకు భద్రత కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసిన అంశంపై హోం మంత్రికి ప్రశ్నలు సంధించారు. జగన్ పర్యటనకు భారీగా జనాలు వస్తారని గుర్తించలేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యమా? డ్రోన్, సీసీ కెమెరాల సర్వైలెన్సు ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వలయం బలహీనంగా ఉందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి అనిత ముందు సమాధానం చెప్పలేక తడబడ్డారు. కొద్ది క్షణాల తర్వాత 1100 మందితో భద్రత కల్పించామని, అందరూ తోసుకెళ్లడంతో హెలికాఫ్టర్‌కు లైట్ క్రాక్ మాత్రమే అయిందని చాలా తేలికగా మాట్లాడారు. అంత మందితో భద్రత కల్పించినా జనాలు తోసుకుంటూ రావడం పోలీసుల వైఫల్యం కాదా? అని మీడియా అడిగితే.. ఒక్కో మనిషికి ఒక్కో పోలీస్‌ను పెట్టాలా? అని తిరిగి మంత్రి విచిత్రంగా ప్రశ్నించారు. ఇంతలో మరో ప్రశ్న వేస్తున్న సమయంలో అనిత మీడియాపై రుసరుసలాడుతూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.