
సమస్యలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
మహారాణిపేట : రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి రెవెన్యూ వర్క్ షాప్‌లో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, నిబంధనలపై, ప్రభుత్వం జారీ చేసే జీవోలపై పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ అవగాహన కలిగి ఉండాలని, సవరణలు, మార్పులపై అప్‌డేట్ అవుతూ ఉండాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ, భూముల బదలాయింపు, సర్వే, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్, కన్వెయన్స్ డీడ్, 22ఏ జాబితా, ప్రభుత్వ భూముల ఆక్రమణ చర్యలు, 27, 30, 296, 388 వంటి జీవోల అమల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సమస్యలను తహసీల్దార్లు, డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇనాం, దేవదాయ శాఖ పరిధిలోని భూముల విషయంలో వివరాలు సరిపోలడం లేదని, జీవో 30, 296, 388 అమల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. 22ఏ జాబితాలను వెబ్ ల్యాండ్‌లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించగా ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ బదులిచ్చారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్ పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, పి.శ్రీలేఖ, సర్వే శాఖ ఏడీ సూర్యారావు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ల్యాండ్ సెక్షన్ అధికారులు, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి రెవెన్యూ వర్క్ షాప్‌లో
కలెక్టర్ హరేందిర ప్రసాద్