
యాదవ ఓట్లతో గెలిచి యాదవులకే వెన్నుపోటు
● ఆ ఇద్దరు యాదవ ఎమ్మెల్యేలు సొంత సామాజికవర్గంలో ముసలం సృష్టిస్తున్నారు ● యాదవ మేయర్‌ను దించేందుకుప్రయత్నిస్తే జీరోలుగా మిగులుతారు ● యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు ఆల్సి అప్పలనారాయణ యాదవ్
మహారాణిపేట : యాదవ కులంలో ముసలం సృష్టించి, యాదవ వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని జీవీఎంసీ మేయర్ పీఠం నుంచి దించేందుకు యాదవ ఎమ్మెల్యేలే ప్రయత్నించడం దౌర్భాగ్యమని యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు, టీఎన్‌టీయూసీ నేత ఆల్సి అప్పలనారాయణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో గెలిచే వరకు కులం కావాల్సి వచ్చిందని, గెలిచాక అదే కులాన్ని దెబ్బతీస్తున్నారని సోమవారం విడుదల చేసిన ఓ వీడియోలో ఆక్షేపించారు. వీరి తీరును యాదవులు, విశాఖ ప్రజలు ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, యాదవుల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ స్థిరత్వం కోసం యాదవులను పావులుగా ఉపయోగించుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఎందుకూ పనికి రాకుండా పోతారని, యాదవ జాతి వీరిని క్షమించదన్నారు. యాదవ వర్గానికి చెందిన మేయర్‌ను దించేందుకు బెహరా భాస్కరరావు, ముత్తంశెట్టి పద్మ తదితరులను వాడుకుంటున్నారని, ఇలాంటి పనులు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేవలం 8 నెలల పదవి కోసం రాజకీయం చేస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యాదవ కులాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. యాదవ కులాన్ని దెబ్బతీసేలా రాజకీయం చేయడం తగదని హితవుపలికారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్‌ను గద్దె దించితే.. ఆ స్థానంలో మరో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారినే కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు.