
అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!
సామాన్య భక్తులకు అల్లంతదూరం
● రూ.1,000 టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితీ అంతే.. ● రూ.1,500 టికెట్లన్నీ కూటమి పార్టీల నేతలకే.. ● టికెట్ల జారీలో దేవాలయ ఈవోకి దక్కని స్థానం ● కలెక్టరేట్, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే వ్యవహారం
డమ్మీగా మారిన ఈవో..!
ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్‌చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహరాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్‌జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్‌కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్‌చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాధారణ భక్తులకే అప్పన్న చందనోత్సవంలో పెద్ద పీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. కేవలం వీఐపీ భక్తుల సేవలోనే తరిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేందుకు సిద్ధమైంది. సాధారణ భక్తులు, ఆన్‌లైన్‌లో రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం అంతరాలయ దర్శనం లభించడం లేదు. కేవలం సిఫార్సులకే పెద్ద పీట వేయడం, సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలన్నీ.. దేవాలయ ఇన్‌చార్జి ఈవోని డమ్మీని చేసి కలెక్టరేట్ నుంచి నడిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల జారీలో కానీ, ఏర్పాట్లలో కానీ ఈవోతో సంబంధం లేకుండా వ్యవహారాలు సాగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా వీఐపీ భక్తులకే అంతరాలయం ద్వారా నిజరూప అప్పన్న దర్శనం లభించనుండగా.. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే హడావుడిగా దర్శనం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది.
సిఫార్సులకే పెద్ద పీట
ఏడాదిలో ఒక్కరోజే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే టికెట్లు మాత్రం సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఆన్‌లైన్ టికెట్లను కూడా ముందుగానే అధికార పార్టీ నేతలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక వీఐపీ టికెట్లతో పాటు రూ.2,500, రూ.1,500, రూ.1000 టికెట్ల జారీలోనూ కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు కోరినన్ని టికెట్లు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలు పది టికెట్లు అడిగితే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. తీరా ఈ టికెట్లను తీసుకునేందుకు సదరు బ్యాంకు వద్దకు వెళితే.. తమకు ఇంకా దేవస్థానం నుంచి లేఖ రాలేదనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థాన అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు కూడా కనీస గౌరవ లేకుండా చేశారని వాపోతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారం ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!