కొఠియా పల్లెల్లో ఒడిశా పోలీసుల జులుం
● భయాందోళనలు చెందుతున్న ఆంధ్రా అధికారులు, సిబ్బంది
● చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం
సాలూరు:
ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారు. అడపాదడపా వివాదాలు తరువాత చాలా కాలం స్తబ్దుగా ఉన్న ఒడిశా యంత్రాంగం రాష్ట్రంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక మళ్లీ తనదైన శైలిలో పాతబాణీని ప్రదర్శిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒకటైన గంజాయిభద్ర పంచాయతీలో దిగువశెంబిలో అంగన్‌వాడీ కేంద్రంలో తెలుగులో ఉన్న చార్ట్‌లు, బోర్డులను ఒడిశా పోలీసులు తీసుకువెళ్లిపోయారు. ఈ నెల 27న సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు పది మంది ఒడిశా పోలీసులు అప్పటికే మూసివేసిన అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వచ్చారు. తెలుగులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం బోర్డును బయట ఉంచరాదని, కేంద్రంలో దాచుకోవాలని చెప్పి కొంత దూరం వెళ్లారు. మళ్లీ ఏమైందో తెలియదుగాని మళ్లీ గ్రామంలోకి వచ్చి బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిపించారు. తెలుగులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం బోర్డును, కేంద్రంలో తెలుగులో రాసి ఉన్న చార్ట్‌లు తదితర సామగ్రిని తీసుకువెళ్లిపోయారు. ఇవి కావాలంటే కొఠియా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో ఆంధ్రా తరఫున అంగన్‌వాడీ కేంద్రం నడపడానికి ఇల్లు ఎందుకు ఇచ్చారని పోలీసులు ఒడియా భాషలో ఇంటి యజమానికి ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి, సూపర్‌వైజర్లు, సీడీపీఓ విజయలక్ష్మికి చెప్పగా బుధవారం గ్రామానికి అంగన్‌వాడీ అధికారులు వెళ్లి విచారణ జరిపారు. విచారణ నివేదికను ఐసీడీఎస్ పీడీ కార్యాలయ అధికారులకు గురువారం అందజేసారు.
చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం
ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కొఠియా గ్రూపు గ్రామాల్లో పని చేసేందుకు ఆంధ్రా అధికారులు, సిబ్బంది భయపడుతున్నారు. తరచూ ఒడిశా పోలీసులు అక్కడ విధి నిర్వహణకు వెళ్లే ఆంధ్రా అధికారులు, సిబ్బందిని అడ్డుకోవడం వంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో స్టేటస్ కో అమల్లో ఉన్నప్పటికీ ఒడిశా పోలీసులు జులం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని స్థానిక గిరిజనులు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, అటు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరిన నేపథ్యంలో దశాబ్దాల ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆంధ్రా కూటమి నేతలు ఏ మేరకు చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. కొఠియా గ్రూపు గ్రామాల వివాదమున్న ఈ సాలూరు నియోజకవర్గానికి రాష్ట్ర సీ్త్రశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఈ వివాదానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment