గిరిజన వర్సిటీ తొలిదశ నిర్మాణాలు..ఏప్రిల్ నాటికి పూర్త
దత్తిరాజేరు:
మెంటాడ–దత్తిరాజేరు మండలాల మధ్య లోని చినమేడపల్లి గ్రామం వద్ద 561 ఎకరాల్లో తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలిదశ పనులు ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వర్సిటీ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని ఎస్‌ఈ లక్షణరావుతో కలిసి చూశారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్, తాగునీరు సరఫరా, రోడ్ల నిర్మాణం, తదితర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడే తరగతులు నిర్వహించేలా ఏప్రిల్‌లో కొన్ని తరగతి గదులను ప్రారంభిస్తామన్నారు. పరిపాలన భవనం, జీ ప్లస్–2, బాలుర వసతి గృహం, జీ ప్లస్–7 అంతస్తులు నిర్మాణాలను వేగవంతం చేశామని, 2027 నాటికి అన్ని భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వర్సిటీ అధికారులు కలెక్టర్‌కు చెప్పారు.
మరడాం వద్ద ఉన్న 420 కేవీ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు విద్యుత్ పంపిణీ జరగాల్సి ఉందని, గిరిజన విద్యాలయం ప్రాంగణం నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్లేందుకు వీలుగా పది ఎకరాల వర్సిటీ స్థలాన్ని కేటాయించాలని ట్రాన్స్‌కో అధికారులు కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన స్థలం ఇవ్వడం కుదరదని, విద్యుత్ కేంద్రం పక్కన ఉన్న కొండపై నుంచి పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన యూనివర్సిటీ ఏఓ డాక్టర్ ఎన్.వి.సూర్యనారాయణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసరావు, బొబ్బిలి ఆర్డీఓ మోహన్‌రావు, ట్రాన్స్ కో ఏఈ బాలాజీ, ప్రాజెక్టు విభాగం ఎస్‌ఈ నరసింగరావు, ఏడీఏ మన్మథరావు, తహసీల్దార్ విజయభాస్కర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment