నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..!
విజయనగరం ఫోర్ట్:
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు బిక్కచూపులు చూస్తున్నారు. నూర్పుడి పూర్తిచేసి రోజులు గడుస్తున్నా రైతు సేవా కేంద్రాల్లో ట్రక్ షీట్‌లు జనరేట్ కాకపోవడంతో ధాన్యం విక్రయించుకోలేని దుస్థితి నెలకుంది. ఓ వైపు పంట పెట్టుబడికి ప్రభుత్వం నుంచి సాయం అందక చేసిన అప్పులు తీర్చలేక... మరోవైపు వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. అన్నదాతా సుఖీభవ అని వినపడాల్సిన చోట అన్నదాతా దుఃఖీభవ అని వినిపిస్తోంది.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో ఇప్పటి వరకు 487 రైతు సేవా కేంద్రాల నుంచి 3.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇందులో 3.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 35,297 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. 3.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్ జనరేట్ చేశారు. 4,607 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్ జనరేట్ చేయాల్సి ఉంది. ఎఫ్‌టీఓ 3,08,197 మెట్రిక్ టన్నులకు జనరేట్ చేశారు. 308 మెట్రిక్ టన్నులకు చేయాల్సి ఉంది. 1005 మెట్రిక్ టన్నుల ధాన్యానికి మిల్లు యాజమాన్యాలు ఎక్‌నాల్జ్‌మెంట్ చేయాల్సి ఉంది. ట్రక్ షీట్‌లు జనరేట్ అయితేనే రైతులు మిల్లుకు ధాన్యం తరలించడానికి అవకాశం ఉంటుంది. ధాన్యం మిల్లుకు వచ్చినట్టు మిల్లు యాజమాని ఎక్‌నాల్జె చేస్తేనే రైతు బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. దీంతో రైతులు ట్రక్ షీట్స్ కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. గంట్యాడ, జామి, ఎస్.కోట, దత్తిరాజేరు, గజపతినగరం తదితర మండలాల్లో ట్రక్ షీట్స్ జనరేట్ కావడం లేదని తెలిసింది.
రైతు సేవా కేంద్రాల్లో జనరేట్‌కాని ట్రక్‌షీట్
ట్రక్ షీట్‌ల కోసం రైతుల పాట్లు
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఆర్.నాగేశ్వరావు వరి నూర్పిడి పూర్తిచేసి వారం రోజులైంది. 40 కేజీల బస్తాలు 106 అమ్మకానికి సిద్ధం చేశాడు. శాంపిల్ కోసం ధాన్యంను రైతుసేవా కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ సిబ్బంది మిల్లులకు టార్గెట్ అయిపోయింది. ట్రక్ షీట్ జనరేట్‌కావడం లేదని సమాధానం ఇచ్చారు. ఽట్రక్ షీట్ ఎప్పుడు వస్తుందో తెలియదన్న సమాధానంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.
ప్రతిపాదనలు పంపించాం
ట్రక్ షీట్‌లు జనరేట్ కావడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చింది. 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఒకటి రెండు రోజుల్లో అనుమతి వస్తుంది.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
అదే గ్రామంలో మరికొంత మంది రైతులు కూడా వరి నూర్పిడి పూర్తిచేశారు. 80 టన్నుల వరకు ధాన్యంను అమ్మకానికి సిద్ధం చేశారు. ట్రక్ షీట్‌ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment