ఆస్తి రిజిస్ట్రేషన్లు.. ఇక కష్టమే!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు సంపద సృష్టి పేరుతో ప్రజలపై బాదుడు పరంపర నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిన సర్కారు.. నేటి నుంచి మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల చార్జీలను భారీగా పెంచుతోంది. పట్టణాలు, పట్టణ శివారు ప్రాంతాలే కాదు.. గ్రామాల్లోనూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువపై 10 నుంచి 35 శాతం వరకూ బాదుడు ఉంటోంది. పెంచిన చార్జీలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు శాఖ ఉద్యోగులు శుక్రవారం రాత్రి వరకూ కసరత్తు చేస్తూనే ఉన్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలతో పాటు ఉభయ జిల్లాల్లోని పట్టణాలు, రియల్ ఎస్టేట్ విస్తరిస్తున్న పట్టణ శివారు ప్రాంతాలు, మండల కేంద్రాల శివారు గ్రామాల లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల చార్జీల మోత మోగించనున్నారు. ఈ ప్రాంతాల్లో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారుల పక్క స్థలాల నుంచి ఎక్కువ మొత్తం లాగేందుకు ప్రభుత్వం చార్జీలను పెంచుతోంది. తద్వారా రిజిస్ట్రేషన్ విలువ స్థిరాస్తి ప్రాముఖ్యత, ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 35 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పెరిగిన భూముల విలువలు శనివారం నుంచి అమలు చేయనున్నారు.
కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏడు నెలలు గడిచేసరికి అసలు విషయం అవగతమైంది. ప్రజల్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడం అన్ని వ్యాపారాల్లాగే స్థిరాస్తి వ్యాపారంపైనా ప్రభావం చూపెడుతోంది. ఏడాదికాలంగా సరిగా విక్రయాలు లేవు. వ్యాపారుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇక పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం స్థలాన్ని లేదా పొలం అమ్మకానికి పెట్టినా కొనేవారు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడీ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న ఆందోళన ఆయా వర్గాల్లో కనిపిస్తోంది. ఇక నిర్మాణాల విలువ సైతం అమాతంగా పెరగనుంది. ఇల్లు కట్టుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, నిర్మాణ చార్జీలు భారీగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఆదాయ పెంపే లక్ష్యం...
ప్రాంతాన్ని బట్టి రిజిస్ట్రేషన్ల చార్జీల మోత
నేటి నుంచి పెంచిన చార్జీల అమలు
పట్టణ ప్రాంతాల్లో 10 శాతం
వరకూ పెంపు
పట్టణ శివారు గ్రామాల్లో అదనంగా
15 శాతం వడ్డింపు
గ్రామాల్లో 20 శాతం వరకూ చార్జీల భారం
కూటమి ప్రభుత్వంలో బాదుడే బాదుడు
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించినట్లు అర్థమవుతోంది. విజయనగరం జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ఏటా రూ.250 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా సుమారు రూ.90 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. దీన్ని మరింత పెంచేందుకు సవరించిన చార్జీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment