10 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఒకేషనల్ విద్య, 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇంటర్మీడియట్ ప్రాథమిక అర్హత పరీక్షలుగా ఈ నెల 1న ఎథిక్స్, 3న పర్యావరణ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్ పరీక్షలకు 41,270 మంది హాజరుకానున్నారని, వీరిలో 35,253 మంది సాధారణ ఇంటర్, 6,017 మంది ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారన్నారు. మొదటి సంవత్సర పరీక్షలకు 20,902 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 20,368 మంది హాజరవుతారని తెలిపారు. సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 93, ఒకేషనల్ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు 783 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 1,313 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. వీరిలో 1,087 మంది రెగ్యులర్, 226 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. పరీక్ష కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించాలని, జెరాక్స్ షాపులను మూసివేయాలని చెప్పారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తాగునీరు, మరుగుదొట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడపాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్‌ఐఓ మజ్జి ఆదినారాయణ, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వచ్చేనెల 1 నుంచి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు
పకడ్బందీగా ఏర్పాట్లు
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment