
ఎక్కడి పనులు అక్కడే ఆపండి..!
సాలూరు: వారంతా నిబంధనల ప్రకారం, కాంట్రాక్ట్‌లు దక్కించుకుని పనులు ప్రారంభించారు. నిర్దేశించిన పనులు చేపట్టే క్రమంలో కొద్ది శాతం పనులు పూర్తయిన తరువాత అధికారులు సదరు కాంట్రాక్టర్‌లకు షాకింగ్ వార్త చెప్పారు. ఎక్కడిపనులు అక్కడే ఆపివేయాలని, స్థానిక మంత్రిని కలిసి ఆమె అంగీకారం తెలిపిన తరువాతే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్లు కంగుతున్నారు. ఇది సాలూరు నియోజకవర్గంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కాలువల పూడికతీత పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ నుంచి పెద్దగెడ్డ సబ్‌డివిజన్ పరిధిలో పూడికతీత పనులు చేపట్టడానికి రూ.91.21 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న కాలువల పూడిక తీత, గోడలు, మదుముల నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. నిబంధనల మేరకు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పరిధిలో 15 పనులకు సంబంధించి టెండర్లు పిలవగా వాటన్నింటి పనులను అధికారుల ఆదేశాల మేరకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించారు. దాదాపు 20 నుంచి 30 శాతం పనులు చేసిన తరువాత కాంట్రాక్టర్‌లకు పెద్దగెడ్డ అధికారుల నుంచి షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. చేస్తున్న పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని, మీరంతా స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలవాలని ఆమె చేయమంటేనే పనులు పూర్తిచేయాలని లేకుంటే లేదని స్పష్టం చేశారు.
పనులు చేసిన వరకు బిల్లులు చెల్లించండి
దీంతో కంగుతున్న కాంట్రాక్టర్‌లు ఆ పనులను నిలిపివేశారు. పనులు ప్రారంభించకముందే ఏదైనా చెప్పాలని, పనులు చేపట్టిన మధ్య ఇలా చెప్పడం ఏమిటని కాంట్రాక్టర్‌లు వాపోతున్నారు. పలువురు కాంట్రాక్టర్‌లు మంత్రిని కలిసిన తరువాత, నిరాశగా వెనుదిరగడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎర్త్‌వర్క్ తదితర పనులు చేపట్టామని కావున చేపట్టిన పనుల వరకు బిల్లుల చెల్లింపులు చేయాలని అధికారులను కాంట్రాక్టర్‌లు కోరడం కొసమెరుపు. దీనిపై పెద్దగెడ్డ డీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ, స్థానిక మంత్రిని కలవాలని కాంట్రాక్టర్లకు చెప్పామన్నారు.
అర్ధాంతరంగా నిలిచిపోయిన పెద్దగెడ్డ పూడికతీత
పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించిన అధికారులు
మంత్రి అంగీకారం లేకుండా పనులు
చేయవద్దని హుకుం

ఎక్కడి పనులు అక్కడే ఆపండి..!
Comments
Please login to add a commentAdd a comment