రేషన్ కష్టాలు..!
21 చోట్ల ఆపరేటర్ల రాజీనామా
జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. 21 చోట్ల ఆపరేటర్లు రాజీనామా చేశారు. అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా డీలర్ల ద్వారా సరుకులు సరఫరా చేస్తున్నాం. మిగిలిన చోట్ల ఎండీయూ వాహనాలతో సరుకులు అందజేస్తున్నాం.
– కె.మధుసూదనరావు,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
●
విజయనగరం ఫోర్ట్: రేషన్ సరుకుల పంపిణీలో మళ్లీ పాతరోజులు వచ్చే సమయం దగ్గర పడింది. నిత్యావసర సరుకుల కోసం గంటలు, రోజుల తరబడి క్యూ కట్టాల్సిందే. పని మానుకుని సరుకుల కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలకు ఎండీయూ వాహన సేవలు అందడం లేదు. వారంతా రేషన్‌డిపో వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. వాహన డ్రైవర్లు మానేసిన చోట కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడమే దీనికి కారణం. గతంలో నడవలేని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మంచాలపై ఉన్న వారు రేషన్ సరుకుల కోసం వెళ్లలేకపోయేవారు. సరుకులు విడిపించేవారు కాదు. పేదలందరికీ రేషన్ సరుకులు అందాలన్న ఉద్దేశంతో పాటు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. పల్లెలు, పట్టణాల్లోని వీధివీధి తిరుగుతూ లబ్ధిదారులకు సరుకులు అందజేసేది. ఇంటిముందరకే వాహనం రావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు సైతం సులభంగా రేషన్ సరుకులు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సేవలపై నిర్లక్ష్యం అలముకుంది. వాహన సేవలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి.
జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు...
జిల్లాలో ఎండీయూ వాహనాలు 370 ఉన్నాయి. వాటిలో 21 ఎండీయూ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాడంగి మండలం, బొబ్బిలి, దత్తిరాజేరు, డెంకాడ, గంట్యాడ, గుర్ల, కొత్తవలస, ఎల్.కోట, మెరకముడిదాం, పూసపాటిరేగ, రేగిడి ఆముదాలవలసలో ఒక్కొక్కటి చొప్పున, భోగాపురంలో–2, గరివిడిలో–03, ఎస్.కోటలో 03, విజయనగరంలో–2 చొప్పున ఎండీయూ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడంతో లబ్ధిదారులకు రేషన్ కష్టాలు తప్పడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5,71,354 రైస్ కార్డుదారులు ఉన్నారు. వీరికి సరుకులు పంపిణీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకుంటున్న దృశ్యం విజయనగరం మండలం జొన్నవలస గ్రామం. ఇంటిముందుకే వచ్చి సరుకులు ఇచ్చే ఎండీయూ (మొబైల్ డిస్పెన్షరీ యూనిట్) వాహనం రాకపోవడంతో రేషన్ డిపో వద్దకే వెళ్లి లబ్ధిదారులు ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి, మధుపాడ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.
జిల్లాలో కొన్నిచోట్ల డిపోలకు వెళ్లి
సరుకులు తీసుకోవాల్సిన దుస్థితి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్
జిల్లాలో 370 ఎండీయూ యూనిట్స్
21 చోట్ల ఎండీయూ ఆపరేటర్ల ఖాళీ
భర్తీలో కూటమి ప్రభుత్వం అలసత్వం
Comments
Please login to add a commentAdd a comment