నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
స్కాట్‌లాండ్‌లో జరిగిన కామన్‌వెల్త్ పోటీల్లో మత్స సంతోషి(ఫైల్)
ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? ఫలానా పనికే పరిమితం కావాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు.. సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్యమధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడ్డొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది.. నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, వివిధ రంగాల పురోగతిలో వెన్నెముఖగా నిలుస్తున్న మహిళల ప్రస్థానానికి ‘సాక్షి’ అక్షర రూపం.
– విజయనగరం ఫోర్ట్/నెల్లిమర్ల రూరల్
● కుటుంబానికి అండగా..
నా పేరు సూరాడ కొర్లమ్మ. మాది తీరప్రాంతమైన చింతపల్లి గ్రామం. సముద్రంలో భర్త రాములు, కుటుంబ సభ్యులు వేటసాగించి తీరానికి చేర్చిన చేపలను గ్రామాల్లో విక్రయిస్తాను. కుటుంబ జీవనోపాధికి అండగా నిలుస్తున్నా. కుటుంబంలో ఎటువంటి ఆపద వచ్చినా తట్టుకొనే శక్తి ఉంది.
అనుకుంటే సాధించగలం
నాన్న జ్యూట్‌మిల్లు కార్మికుడు. అమ్మది కూలిపని. నాతో పాటు ఇద్దరు అక్కలు, అన్నయ్యను సాకేందుకు ఆర్థిక ఇబ్బందులు పడేవారు. అప్పుడప్పుడు మేము కూడా కూలి పనులకు వెళ్లేవారం. ఇంట్లో పేదరికాన్ని చూశాను. గ్రామంలో నా స్నేహితులు క్రీడల్లో శిక్షణకు వెళ్తుంటే చూస్తూ ఉండేదాన్ని. క్రీడల్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరవచ్చన్న ఉపాధ్యాయుల మాటతో కొండవెలగాడలోనే తొలుత వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాను. మొదటి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాను. గ్రామీణ జాతీయ పోటీల్లో సత్తా చాటాను. అప్పటి నుంచి నాలో కసి పెరిగినా ఆర్థిక స్థోమత లేని కారణంగా నిరాశ చెందేదాన్ని. ఓ సారి మణిపూర్‌లో జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు రూ.5వేలు అవసరమయ్యాయి. డబ్బులు లేక అవకాశాన్ని వదులుకుంటున్నా అని దిగులు చెందుతుండగా మా పెద్ద అక్క రాజీ తన చెవిదిద్దులను అమ్మేసి నన్ను పోటీలకు పంపించారు. ఎలాగైనా పోయిన బంగారాన్ని సాధించాలనుకున్నా... అనుకున్నట్లే బంగారు పతకంతో తిరిగొచ్చా. ఇప్పటివరుకు దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, చైనా దేశాల్లోని వేదికలపై బహుమతులు సాధించాను. కామన్‌వెల్త్‌లో వచ్చిన కాంస్యంతో పాటు 16 అంతర్జాతీయ పతకాలొచ్చాయి. క్రీడాకోటాలో రైల్వేలో టీటీగా ఉద్యోగం వచ్చింది. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రయత్నంతో ముందుకు సాగాలి.
– మత్స సంతోషి, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టిర్, కొండవెలగాడ గ్రామం
వేటకు వెన్నెముకగా...
విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు 27 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 21వేల (ప్రత్యక్షంగా ఆరువేలు, పరోక్షంగా 15 వేలు) మంది మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. మగవారు సముద్రంలో చేపలు వేటాడి తీరానికి చేర్చగా... వాటిని విక్రయించే బాధ్యతను మత్స్యకార మహిళలు భుజానకెత్తుకుంటారు. సుమారు 540 మంది మహిళలు చేపల అమ్మకంతో కుటుంబానికి, వేటకు వెన్నెముకగా నిలుస్తున్నారు.
– పూసపాటిరేగ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment