● పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు
● మండుటెండలోనే పనులు
● 8 వారాలుగా వేతనాలు అందక విలవిల
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్‌లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురైతే ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది.
బకాయిలు రూ.5 కోట్లకు పైనే..
వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్‌లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్‌కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్‌పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు.
కొలతలకు టేప్ సప్లై లేదు..
ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు.
టెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం
వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం.
శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్
వేతనదారులకు నిలువనీడ కరువు