
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు
● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్
మస్తానయ్య
బొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్‌లో మాట్లాడారు.
కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్‌ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.