
సైబర్ నేరాలపై అప్రమత్తం
పాలకొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు హితవు పలికారు. ఇటీవల వీరఘట్టం మేజర్ పంచాయతీతో పాటు, విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జరిగిన సైబర్ నేరాలను తమ సిబ్బంది ఛేదించిన సందర్బంగా సోమవారం పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ తెలియజేసిన కేసుల వివరాలిలా ఉన్నాయి.. గత నెల 29న సంతకవిటి మండలానికి చెందిన బొద్దాన సుధాకర్ నుంచి రూ.12 వేలు, కోరాడ సంతోష్‌కుమార్ నుంచి రూ.15 వేలతో పాటు గత నెల 31న వీరఘట్టం మేజర్ పంచాయతీకి చెందిన ఎం.ప్రతాప్ నుంచి రూ.28 వేలు ఫోన్‌పే ద్వారా కాజేసిన సైబర్ నేరగాడిని పోలీసులు విజయవాడలో పట్టుకున్నారు. తొలుత సైబర్ నేరగాడు బాధితులకు 7569341175 అనే ఫోన్ నంబర్ ద్వారా కాల్స్ చేయడంతో ఆ నంబర్‌ను ట్రాక్ చేసి విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు వీరఘట్టానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ వి.చంద్రశేఖర్, కానిస్టేబుల్ వి.నవీన్‌లను బృందంగా ఏర్పాటు చేసి విజయవాడకు పంపించారు. వారిని సీఐ ఎం.చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై జి.కళాధర్ మానిటరింగ్ చేస్తూ సైబర్ నేరగాడి ఫోన్ ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు ఆ వివరాలను క్రైమ్ టీమ్‌కు తెలియజేశారు. ఈ విధంగా నాలుగు రోజుల పాటు విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఫోన్‌నంబర్ ఆధారంగా గాలించి సైబర్ నేరస్తుడు మున్న వెంకట నవీన్ ఆచూకీ గుర్తించి విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.
అన్ని కోణాల్లో విచారణ
ప్రస్తుతం వీరఘట్టం, సంతకవిటి మండలాల్లో సైబర్ నేరాలకు పాల్పడిన మున్న వెంకట నవీన్ బీటెక్ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై ఇలా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి డగ్గర నుంచి రూ.55 వేలు రికవరీ చేశారు. నిందిత వ్యక్తి గూగుల్‌లో వ్యాపారులు, పెద్ద పెద్ద వర్తకుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఎస్సై నంటూ, ఏఎస్సై నంటూ, కానిస్టేబుల్ నంటూ ఫోన్‌లు చేసి వారిని నమ్మించి ఫోన్ పే ద్వారా డబ్బులు కాజేశాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని విచారణ చేసి పాలకొండలో కోర్టులో హాజరు పరిచారు.
పోలీస్ సిబ్బందికి అభినందనలు..
సైబర్ నేరాన్ని విజయవాడ వెళ్లి ఛేదించిన వీరఘట్టం హెడ్ కానిస్టేబుల్ వి.చంద్రశేఖర్, కానిస్టేబుల్ వి.నవీన్‌లను, మానిటరింగ్ చేసిన వీరఘట్టం ఎస్సై జి,కళాధర్, సీఐ ఎం.చంద్రమౌళిలను డీఎస్పీ రాంబాబు అభినందించారు. సమావేశంలో పాలకొండ ఎస్సై ప్రయోగమూర్తి పాల్గొన్నారు.
పాలకొండ డీఎస్పీ రాంబాబు హితవు