ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఐఈఓ
వనపర్తి విద్యావిభాగం: బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉందని.. దానిని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎంత సమయం పడుతుందనే వివరాలు తెలుస్తాయన్నారు. సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని.. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
అరుణాచలానికి
ప్రత్యేక బస్సు
కొత్తకోట: ఈ నెల 14న పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచలం దైవ క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు వనపర్తి బస్‌స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుందని వివరించారు. ఈ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగుతుందని, 13వ తేదీన కాణిపాకం, అదేరోజు సాయంత్రం వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. 14వ తేదీన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దర్శనానంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అడ్వాన్సుగా సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే సెల్‌నంబర్ 94906 96971 సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బోరుబావులను
గుర్తించాలి : ఆర్డీఓ
ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికిగాను సేకరించిన భూముల్లో బావులు, గొట్టపు బావులు తదితర వాటిని గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మంగళవారం మండల కేంద్రం సమీపంలో కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను తహసీల్దార్ సుగుణ, భూ సేకరణ తహసీల్దార్ సుభాష్‌తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ భూములతో పాటు గట్టుకాడిపల్లికి వెళ్లే రహదారి, కట్ట నిర్మాణం తదితర వాటిని పరిశీలించి మాట్లాడారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. భూ నిర్వాసితుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. కట్ట వెనుకభాగం పెంచడంతో గట్టుకాడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ముంపునకు గురవుతుందని.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట ఆర్‌ఐ తిరుపతయ్య, సర్వేయర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా
వివరాల నమోదు
పాన్‌గల్: గ్రామాల్లో క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్‌సీడీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డా. రాంచందర్‌రావు సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానితుల వివరాలను ఆన్‌లైన్‌లో తప్పక నమోదు చేయాలన్నారు. అలాగే చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని, ప్రతి గర్భిణి పీహెచ్‌సీలోనే కాన్పు చేయించుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య పరీక్షల విషయంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. సమావేశంలో పీహెచ్‌సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, సీహెచ్‌ఓ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఐఈఓ
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment