వరంగల్: జిల్లాలో ఈ నెల 20న నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా 1,91,380 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ వారి అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రలు వేస్తారని తెలిపా రు.
20న తప్పినవారికి 27వ తేదీన వేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడానికి ముందుకు రారని, అలాంటి సంస్థలను గుర్తించి వారి యాజమాన్యాలను వైద్యాధికారులు, సిబ్బంది హెచ్చరించాలని సూచించారు. నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని తెలిపారు. రక్తహీనత, చదువుపై శ్రద్ధ తగ్గటం, చిరాకు, మతిమరుపు లక్షణాలు ఉంటాయని తెలిపారు.
పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రలు వేసుకోవాలని, 1–2 సంవత్సరాల బాలబాలికలకు సగం ట్యాబ్లెట్‌ను నీటిలో కలిపి అందించాలన్నారు. ఆ పై వయస్సు ఉన్న వారికి పూర్తి ట్యాబ్లెట్ వేయాలని చెప్పారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, ఒక వేళ వస్తే తమ సిబ్బంది వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈఓ విద్యాసాగర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment