సాక్షి, వరంగల్: జిల్లాలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేందుకు.. అదే సమయంలో ఓటర్లను తనవైపు ఎలా మలుపు తిప్పుకోవాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే గంటల వ్యవధిలో పార్టీలు మారుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో తలనొప్పి వస్తుండడంతో వీటిని నియంత్రించేందుకు ఏకంగా కొందరు కోవర్టుగా తమవారిని కావాలనే ప్రత్యర్థుల దగ్గరకు పంపించి అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.
అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ కోవర్టు రాజకీయం చేస్తుండటం గమనార్హం. ఆయా పార్టీల్లోని కీలక నేతలు వచ్చే అవకాశముందని ముందస్తు సమాచారం ఇస్తుండడంతో వారిని నిరోధించేందుకు ఆయా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మరీ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో తనకు వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్ బాగుంటుందనే భరోసానిస్తున్నారు. లేదంటే కవాల్సింది సమకూరుస్తామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్న ఘటనలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో జనాలను తమవైపునకు తిప్పుకోవడంపై బూత్ స్థాయిల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు నేతలు.
అన్ని నియోజకవర్గాల్లో...
జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేటతోపాటు వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు, పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో రాజకీయం రంజుగా మారింది. ప్రతిరోజూ అన్ని పార్టీల్లో చేరికలు ఉంటుండడంతో వాస్తవంగా పార్టీలో చేరేవారు ఎవరు, ప్రత్యర్థులకు కోవర్టులుగా పనిచేసే వారు ఎవరో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు నేతలు. అందుకే అందరూ నేతలు తమవారిని ప్రత్యర్థుల వద్ద కోవర్టులుగా పంపించి వారి రాజకీయ ఎత్తులను తెలుసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే వరంగల్ తూర్పులో నివాసముండే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే సమాచారం మేరకు ఆయనను బీఆర్‌ఎస్ నేతలు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడినా ఆయన పార్టీ మారడం ఖాయమనే చర్చ మళ్లీ జరుగుతోంది. అలాగే రాయపర్తి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ కీలక నేత ఒకరు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారన్న సమాచారం మేరకు అక్కడి బీఆర్‌ఎస్ ముఖ్య నేత వారి ఇంటికి వెళ్లి తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సముదాయించినట్టుగా తెలిసింది.
నర్సంపేట నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌కు వెళ్తున్నారన్న సమాచారంతో అక్కడా కూడా నిలువరించే ప్రయత్నం జరిగింది. పరకాల నియోజకవర్గంలోనూ ఈ సీన్‌లు రోజుకొకటి కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలా కోవర్టుల రాజకీయంతో కీలక నేతల అడుగులు తెలుసుకొని వారిని ఆ పార్టీలోనే ఉంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యనేతల బుజ్జగింపుతో కొందరు నాయకులు పార్టీలు మారకుండా ఆగి నా.. ఇంకొందరు మాత్రం పార్టీని వీడుతున్నారు. దీంతో కోవర్టుల రాజకీయంతో కొంతలోకొంతైనా ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయడంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు సఫలీకృతమవుతున్నారు. అయితే నవంబర్ 30 ఎన్నికలు జరిగే వరకు ఏ పార్టీ నేతలు ఏపార్టీలో ఉంటారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment