కొలువులకు కోత !
వృథాగా 215 పోస్టులు
ఎన్పీడీసీఎల్ సంస్థలో గన్‌మ్యాన్, టెలిఫోన్ బాయి, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్, టెలిఫోన్ ఆపరేటర్, టూల్ కీపర్ వంటి 215 పోస్టులు ఎన్నో ఏళ్లుగా వృథాగా ఉంటున్నాయి. వీటిని క్షేత్ర స్థాయి వర్క్‌మెన్ పోస్టులుగా మార్చాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు మూడేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదే అదనుగా పదోన్నతుల కోసం ఇంజనీర్లు ఇందులో ప్రవేశించి తమకు కొన్ని పోస్టులు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే.. ఈ పోస్టులకు చెల్లించే జీతాల మొత్తం ప్రతిపాదిత పోస్టుల మొత్తానికయ్యే జీతాలకు సరిపోక యాజమాన్యం దృష్టి.. భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులపై పడింది.
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్ల పదోన్నతుల కోసం వర్క్‌మెన్ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల అవకాశాలు కొల్లగొడుతున్నదనే అపవాదును మూటగట్టుకుంటోంది. వర్క్‌మెన్ పోస్టులను తగ్గించి వాటిని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఉన్నత స్థాయి పోస్టులు సృష్టించడంపై క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించినా ఆ మేరకు ఆపరేటర్లను నియమించకపోవడంతోఅందుబాటులో ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఉద్యోగులపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. కొన్ని సబ్‌స్టేషన్లలో రిటైర్డ్ ఉద్యోగుల ను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ ని ర్వహణను నెట్టుకొస్తున్నారే తప్ప సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకంపై యాజమాన్యం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
23 నెలల క్రితం నోటిఫికేషన్
టీజీ ఎన్పీడీసీఎల్‌లో 932 పోస్టులు ఖాళీగా ఉండగా 23 నెలల క్రితం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఇటీవల 93 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 839 పోస్టులు భర్తీ చేయలేదు. వాటిలో 200 పోస్టులకు కోత పెట్టి ఉన్నతస్థాయి పోస్టులుగా సృష్టించి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది లేక.. ఉన్న ఉద్యోగులపై పని భారం పడుతున్నా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు.
339 కొత్త పోస్టుల స్థిరీకరణ
కొన్నేళ్లుగా వృథాగా ఉన్న 215 అన్‌యూజ్డ్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల్లో 200 కలిపి మొత్తం 415 పోస్టుల స్థానంలో కొత్తగా 339 పోస్టులు స్థిరీకరించారు. అందులో చీఫ్ ఇంజనీర్, సీజీఎం(అకౌంట్స్), జాయింట్ సెక్రటరీ(పీఅండ్‌జీ), జనరల్ మేనేజర్ (పీఅండ్‌జీ), అకౌంట్స్ ఆఫీసర్ ఒక్కో పోస్టు చొప్పున, ఎస్‌ఈ, డీఈ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, వాచ్‌మెన్ పోస్టులు నాలుగు చొప్పున, రెండు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆరు అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్ పోస్టులు 16 చొప్పున, జూనియల్ అకౌంట్స్ ఆఫీసర్ 20, సీనియర్ అసిస్టెంట్ 88, సీనియర్‌లైన్ ఇన్‌స్పెక్టర్ 32, అసిస్టెంట్ లైన్‌మెన్ 48, ఆఫీస్ సబార్డినేట్ 88, స్వీపర్ పోస్టులు ఆరు మార్చినట్లు సమాచారం.
వంతుల వారీగా విధులు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లు 994 ఉండగా ప్రస్తుతం 1,511కు పెరిగింది. విద్యుత్ సర్వీసులు 48,17,575 ఉండగా 68,51,012కు పెరిగా యి. ఈ లెక్కన 517 సబ్‌స్టేషన్‌లు, 20,33,437 సర్సీసులు పెరిగాయి. అయితే.. విద్యుత్ వినియోగదారులకు సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించలేదు. ప్రతీ సబ్ స్టేషన్‌కు కనీసం నలుగురు ఆపరేటర్లు అవసరం. ఈ లెక్కన కొత్తగా నిర్మించిన 517 సబ్‌స్టేషన్‌లకు 2,068 మంది కావాలి. అన్ యూజ్ డు పోస్టుల స్థానంలో సృష్టించిన కొత్త పోస్టుల్లోనూ సబ్‌స్టేషన్ ఆపరేటర్లను మరిచా రు. దీనికి తోడు గతంలో పని చేసిన ఆపరేటర్లు రిటైర్డ్ అవుతుండడంతో ప్రతి నెలా ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో జేఎల్‌ఎంలు, ఏఎల్‌ఎంలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు వంతుల వారీగా ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీ ఉండడంతో ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేసే వారు కరువయ్యారు.
ప్రమోషన్ల కోసం పోస్టుల కుదింపు
టీజీ ఎన్పీడీసీఎల్ తీరుతో
నిరుద్యోగుల అవకాశాలకు గండి
సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్లు కరువు
గ్రామాల్లో జూనియర్ లైన్‌మెన్ల కొరత
క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ఇబ్బందులు
పని భారంతో
ఏఅండ్‌ఎం ఉద్యోగుల అవస్థలు
పదోన్నతుల కోసం కాదు..
అన్ యూజ్‌డు పోస్టులను ఇతర పోస్టులుగా మార్చడం పదోన్నతుల కోసం కాదు. ఎన్పీడీసీఎల్ పరిధి రిమోట్ ఏరియాలో కొత్తగా సెక్షన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ములుగు సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. మరికొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి, వినియోగంలో లేని పోస్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వినియోగదారులకు సేవలు అందించేందుకు, అడ్మినిస్ట్రేషన్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో జేఎల్‌ఎం పోస్టులు భర్తీ చేయనున్నం. ఈ నియామకాలతో సబ్‌స్టేషన్ ఆపరేటర్ల కొరత తీరుతుంది. – కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ ఎన్పీడీసీఎల్
కొలువులకు కోత !
Comments
Please login to add a commentAdd a comment