
పూడికతీత పనులు వేగవంతం చేయండి
నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
హన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తాగునీటి సరఫరా, రబీపంటలకు సాగు నీరు, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్‌కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో డివిజన్లకు ధర్మసాగర్ తాగునీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 24 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రానున్న రోజుల్లో అదనంగా మరో 21 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment