
ఎవరి సామర్థ్యం ఎంత?
విద్యారణ్యపురి: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం–20 లక్ష్యాలకు అనుగుణంగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి సమగ్ర శిక్ష, ఎస్‌సీఆర్టీ, పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక విద్యా స్థాయిలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు అమలు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా చదవడం, రాయడం.. సంఖ్యాశాస్త్రంలో(గణితం) గ్రేడ్ స్థాయి సామర్థ్యాలను విద్యార్థులు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెండేళ్లుగా అభ్యసన సామర్థ్యాల (ఎఫ్‌ఎల్‌ఎన్) పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేస్తుండగా.. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయా.. లేదా? అనేది పరిశీలించేందుకు ఈనెల 24, 25 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నారు.
పఠన, లిఖిత, గణిత పరీక్ష పోటీలు
సామర్థ్యాల పరీక్షకు హనుమకొండ జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థులకు పఠనోత్సవం, లిఖితోత్సవం, గణితోత్సవం పేరుతో సృజనాత్మక పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు, ప్రశంస పత్రాలు అందించి ప్రోత్సహింనున్నారు. హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఈకార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. సోమ, మంగళవారం విద్యార్థులకు తెలుగు, ఉర్దూ, ఆంగ్లం గణితానికి సంబంధించి అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. దీనికి సంబంధించి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు, తల్లిదండ్రులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో పీఎస్, యూపీఎస్‌లు మొత్తం 360 ఉండగా.. ఐదో తరగతి వరకు 10 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఎంపిక చేసిన విద్యార్థులకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. పఠన, లిఖిత, గణిత, తదితర అంశాల్లో విద్యార్థుల స్థాయిని బట్టి సిలబస్‌కు అనుగుణంగా పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు, ప్రశంస పత్రాలు అందించనున్నారు. హనుమకొండ జిల్లాలో 36 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధి విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. ఒక్కో స్కూల్‌కాంప్లెక్స్ పరిధిలో 12 నుంచి 15 వరకు పాఠశాలలుంటాయి. ఈ పోటీల ద్వారా ఉపాధ్యాయులు రెండేళ్లుగా అభ్యసన సామర్థ్యాలు ఎలా పెంచారనేది కూడా తేలిపోనుంది. దీంతో ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది.
సామర్థ్యాల పరిశీలనకు..
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలు చేసినప్పటి నుంచి విద్యార్థుల సామర్థ్యాలు క్రమక్రమంగా పెరగుతుండడం గమనించాం. స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఈపోటీలతో విద్యార్ధుల్లో ఎవరి ప్రతిభ ఎలా ఉందో వెలికి తీసినట్లవుతుంది.
– డి.వాసంతి, డీఈఓ, హనుమకొండ
గుణాత్మక, సృజనాత్మక పోటీలు
వివిధ పాఠశాలల మధ్య గుణాత్మక పోటీని పెంచేందుకు విద్యార్థుల్లో ప్రతిభా పాటవాల వెలికితీతకు ఈపోటీలు నిర్వహిస్తున్నాం. ఈపోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహించినట్లవుతుంది.
– ఎ.శ్రీనివాస్, క్వాలిటీ జిల్లా కో–ఆర్డినేటర్
రెండేళ్లుగా ఎఫ్‌ఎల్‌ఎన్ పెంపునకు
ఉపాధ్యాయుల కృషి
24, 25 తేదీల్లో స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థులకు పలు పోటీలు
ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు

ఎవరి సామర్థ్యం ఎంత?

ఎవరి సామర్థ్యం ఎంత?
Comments
Please login to add a commentAdd a comment