నీళ్లు లేవనడం కాంగ్రెస్‌ చేతగాని తనం | - | Sakshi
Sakshi News home page

నీళ్లు లేవనడం కాంగ్రెస్‌ చేతగాని తనం

Published Mon, Feb 24 2025 1:33 AM | Last Updated on Mon, Feb 24 2025 1:32 AM

నీళ్లు లేవనడం కాంగ్రెస్‌ చేతగాని తనం

నీళ్లు లేవనడం కాంగ్రెస్‌ చేతగాని తనం

ఖిలా వరంగల్‌: రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి ‘వరి సాగు చేయొద్దు.. నీళ్లు లేవని చెప్పడం’ కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వరంగల్‌ బొల్లికుంట ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా నాడు కేసీఆర్‌, నేడు రేవంత్‌రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం కేసీఆర్‌ నాశనం చేస్తే.. మిగిలిన 50 శాతం కాంగ్రెస్‌ నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లు లేక 7 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయిందని, యూరియా పుష్కలంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక చిన్న చిన్న కాలేజీలు అడుక్కునే పరిస్థితి ఉందని, అప్పులు చేసి విద్యా సంస్థలు నడిపించే దుస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగనే గాలికొదిలేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో ఆసరా, రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే ఇచ్చారు.. నేటికీ 2లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. టీచర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నా యి.. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు బెన్‌ఫిట్స్‌ ఇవ్వలేక కేసీఆర్‌ 61 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెడితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచే యోచనలో ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారని, రాహుల్‌ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉపాధ్యాయులు చైతన్యవంతులై బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి, నాయకులు శ్రీధర్‌, సత్యపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, కాళీప్రసాద్‌, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి

గుణపాఠం చెప్పాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

బండి సంజయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement