ఓరుగల్లుకు ప్రథమ ప్రాధాన్యమివ్వండి
కేంద్ర రైల్వే మంత్రికి మంత్రులు,
ఎంపీల వినతి
సాక్షిప్రతినిధి, వరంగల్: కొత్తలైన్లు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనుల కోసం నిధులు కేటాయించే విషయంలో ఉమ్మడి వరంగల్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా మంత్రులు, ఎంపీలు కోరారు. తెలంగాణ పర్యటనలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించారు. నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ నూతన బైపాస్ అలైన్‌మెంట్ మార్చాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ కావ్య కోరారు. సికింద్రాబాద్ టు వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్ రైలును తిరిగి నడిపించాలని కోరారు. ఈవిషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బైపాస్‌ను ఓఆర్‌ఆర్ చుట్టూ అలైన్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా కావ్య కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. అందుకు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల టీం వర్కే కారణమని అన్నారు. కాజీపేట డివిజన్ అప్‌గ్రేడ్‌పై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని ఎంపీ కావ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment