
కొమ్మాలకు పోటెత్తిన భక్తజనం
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర జోరుగా సాగుతోంది. శనివారం రెండో రోజు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. హోలీ రోజు అర్ధరాత్రి వరకు రాజకీయ ప్రభలు పెద్దఎత్తున జాతరకు తరలిరావడంతో వరంగల్–నర్సంపేట రహదారిపై వాహనాలు గంటల కొద్ది నిలిచిపోయాయి. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలోని గిర్నిబావి ప్రాంతం నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంసీపీఐ(యూ) ప్రభలు అధిక సంఖ్యలో జాతరకు పోటెత్తాయి. ప్రభల ముందు గిరిజన మహిళలు, యువతులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఏస్‌ఈ కరుణాకర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, జాతరకు సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారని, ఈ నెల 18న రాత్రి 10 గంటలకు స్వామి వారి రథ్సోవాన్ని నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాల ని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు కోరారు.
రెండో రోజూ లక్ష మంది దర్శనం
రాజకీయ ప్రభలతో ట్రాఫిక్ జాం
Comments
Please login to add a commentAdd a comment