‘పది’ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
వరంగల్: జిల్లాలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై కేంద్రాల సూపరింటెండెంట్లతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 49 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గుర్తించిన పరీక్షల కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ జారీచేసిన నిబంధనలను తప్పకుండా పాటిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల సీఆర్పీ 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 9,237 మంది రెగ్యులర్ విద్యార్థులు
జిల్లాలో టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 287 పాఠశాలల్లో 9,237 మంది రెగ్యులర్ విద్యార్థులు, 155 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49 మంది సీఎస్, 50 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 559 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 4,803 మంది, బాలికలు 4,434 మంది పరీక్షలు రాయనున్నారు. ఫ్లయింగ్‌స్క్వాడ్లు 3 బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్లు 49 మందిని నియమించారు.
పరికరాలు అందుబాటులోకి తేవడం అభినందనీయం
రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యవసాయ పరికరాలతో నెలకొల్పిన మన అగ్రిటెక్ సంస్థను కలెక్టర్ గురువారం సందర్శించారు. డ్రోన్ స్ప్రేయర్‌ను కలెక్టర్ సత్యశారద, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్‌మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత పాశికంటి రమేశ్ స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను కలెక్టర్‌కు వివరించారు. నూతనంగా ఆవిష్కరించిన డ్రోన్ ప్రత్యేకతలు, మన అగ్రిటెక్ ద్వారా రైతులకు 8 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించాలని రమేశ్ కలెక్టర్‌ను కోరారు. రైతులకు కావాల్సిన రాయితీ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్, మార్కెట్ ప్రతినిధులు ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment