
ఐపీఎల్ వేళ యాప్‌లతో పందేల జోరు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ హనుమకొండలో స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సుమారు రూ.30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. చివరకు తండ్రికి విషయం చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆయన ఉన్న ప్లాటును అమ్మి అప్పులు తీర్చాడు. అయితే ఎలాగైనా పోయిన డబ్బులు సంపాదించాలని రాజ్‌కుమార్ మళ్లీ అప్పులు చేసి యాప్‌లో బెట్టింగ్ కాశాడు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ల వేధింపులు పెరగడంతో ఈ ఏడాది జనవరి ఐదున తండ్రిని రూ.నాలుగు లక్షలు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో రాజ్‌కుమార్ ఉరేసుకుని జనవరి 10న ఆత్మహత్య చేసుకున్నాడు.
రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు డిగ్రీ చదివి బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. హనుమకొండకు మకాం మార్చి పోస్టల్‌కాలనీలో తాను విద్యార్థినని చెప్పి అద్దె గదిలో నివాసం ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పులై దొంగ అవతారం ఎత్తాడు. హనుమకొండ, హసన్‌పర్తి, కేయూసీ, సుబేదారి, సంగెం, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 చోరీల్లో 334 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో 640 గ్రాముల వెండి చోరీ చేశాడు. చివరకు గత అక్టోబర్ 28న పోలీసులకు చిక్కాడు.
అత్యాశకు వెళితే
ఆర్థికంగా నష్టపోవుడే..
● పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిందే
● తల్లిదండ్రుల అప్రమత్తత అవసరమే
● గత ఘటనలను
గుర్తు చేస్తున్న పోలీసులు
సాక్షి, వరంగల్:
ఐపీఎల్ రానే వచ్చింది. శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఈ జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు సిద్ధమవుతున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరిస్తోంది. ఎవరితో సంబంధం లేకుండానే ఫోన్‌లోనే క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు నిక్షిప్తం చేసుకొని ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తూ బెట్టింగ్ చేస్తున్నారు. కొందరేమో తమ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీఐ ఐడీల ద్వారా, మరికొందరు కాలేజీలో పరీక్షలు, హాస్టల్ ఫీజు అని తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ మొదలవుతుండడంతో ఈ బెట్టింగ్ యాప్‌ల జోరు పెరగొచ్చని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పిల్లలు వాడే సెల్‌ఫోన్లు, వారి ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. యాప్‌ల్లో డబ్బులు పోయి ఏకంగా ప్రాణాలు తీసుకున్న యువకులు ఉన్నారు. ఆ దిశగా ఎవరూ వెళ్లొద్దని పోలీసులు అంటున్నారు. బెట్టింగ్ పెట్టే వాళ్లపై కేసులు నమోదుచేసే అవకాశం ఉండడంతోనే దందా నిర్విరామంగా సాగుతోందని, బెట్టింగ్ చేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవడం కూడా ఓ కారణమని చెప్పవచ్చు.
రేషియో యాప్‌ల జోరు..
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఒకప్పుడు ఫోన్ల ద్వారా ఆయా జట్టు విజయాలపై బుకీలకు సమాచారం ఇచ్చేవారు. ఫంటర్లను పెట్టుకొని దందా నడిపేవారు. ఇప్పటికీ ఈ దందా ఉన్నా.. ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. ముఖ్య నిర్వాహకుడే యాప్ రూపొందించి బుకీలకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు ఇచ్చి నయా దందాకు శ్రీకారం చుడతాడు. ప్రధాన నిర్వాహకులు ఆయా జట్ల విజయాలకు సంబంధించిన రేషియోను ఆ యాప్‌లో నిక్షిప్తం చేస్తుండడంతో ఇందుకు అనుగుణంగా బుకీలు తమ ఫంటర్లకు చెప్పి దందా చేస్తారు. ఇలా బుకీలకు వచ్చిన ఆదాయంలోనే కొంత డబ్బును ప్రధాన నిర్వాహకుడికి అందిస్తారు. యూపీఐ చెల్లింపులతో పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో బిట్‌కాయిన్ల రూంలో దందా చేస్తుండడం గమనార్హం. గతంలో పోలీసులకు చిక్కిన బెట్టింగ్ బుకీలతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
యాప్‌ల సమాచారం ఇవ్వాలి..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి డప్ఫాబెట్, 1 ఎక్స్ బెట్. స్కై ఎక్స్‌చేంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్ గురూ, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్ వంటి ఆన్ లైన్‌క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు డౌన్ లోడ్ చేసి పందెంకాస్తూ నష్టపోయిన వారు గతంలో చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల గురించి సమాచారం తెలిస్తే ఇవ్వాలి. బెట్టింగ్ ఎవ్వరూ చేయవద్దు. ఈ బెట్టింగ్‌లతో యువత కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది.
– సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్
75 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు
స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ భారత్‌లో ప్రతి ఏటా రూ.8,20,000 కోట్ల దాకా ఉంటుందని థింక్ చేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక చెబుతోంది. భారత్‌లో 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్‌లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని టీసీఎఫ్ నివేదిక పేర్కొనడం చూస్తే బెట్టింగ్ యాప్ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 75 వెబ్‌సైట్లు, యాప్‌లు బెట్టింగ్‌కు సంబంధించినవి పనిచేస్తున్నాయి.

ఐపీఎల్ వేళ యాప్‌లతో పందేల జోరు
Comments
Please login to add a commentAdd a comment