క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
గీసుకొండ: జిల్లాను క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని హనుమాన్ జంక్షన్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ క్షయ అంటు వ్యాధి అని, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలని, తగిన సమయంలో వ్యాధిని గుర్తించి వైద్యుల సలహా మేరకు చికిత్సలు పొంది మందులు వాడితే త్వరగా నయం అవుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కింద నెలకు రూ.వెయ్యి సహాయంగా అందిస్తోందన్నారు. జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆచార్య మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 1,430 టీబీ కేసులు నమోదు కాగా , ఈ ఏడాది ఇప్పటి వరకు 276 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని, వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్చన, డాక్టర్ విజయ్‌కుమార్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ నర్సింహారెడ్డి, డీపీఓ అర్చన, క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment