ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో దొడ్డురకం ధాన్యంతోపాటు ప్రత్యేకంగా సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నధాన్యానికి బోనస్‌ను అందించినట్లు పేర్కొన్నారు. ఈ రబీ సీజన్లో కూడా అదే విధంగా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నమోదు కాని పంటల వివరాలను ఈనెల 29 నాటికి అన్ని మండలాల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. హార్వెస్టర్ యజమానులతో ఆర్డీఓలు, రవాణా శాఖ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో మూడు రోజుల్లో సమావేశం నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తున్న చోట్ల తూనికలు కొలతలశాఖ అధికారులు తూకాలను తనిఖీ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ కోసం షెడ్ నెట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం హెల్ప్‌డెస్క్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లతో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్, డీఆర్డీఓ మేన శ్రీను, పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, ఎల్‌డీఎం శ్రీనివాస్, మార్కెటింగ్, తూనికలు కొలతలు, రవాణా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment