వరంగల్ క్రైం: తీవ్రమైన నేరాలకు పదేపదే పాల్పడే అక్రమార్కులు, నేరస్తులపై పీడీయాక్టులతో పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఇబ్బందిగా పరిణమించే వారిపట్ల ఇదో చట్టపరమైన ఆయుధం. కానీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లుగా పీడీయాక్టుల కేసు నమోదు అంతంతమాత్రమే. గత ఏడాది కేవలం రెండు కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కకేసు కూడా పెట్టలేదు. కానీ, అక్రమార్కుల ఆగడాలు, కబ్జాదారులు, గంజాయి, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట పడిందంటే లేదనే చెప్పాలి.
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు, రవీంద్రకుమార్, తరుణ్‌జోషి హయాంలో ఎక్కువగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఏవీ రంగనాథ్ పనిచేసిన సమయంలో అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఉక్కపాదం మోపారు. పేదల భూముల్లో అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుట్టించారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు, ఉదాసీనతతో అక్రమార్కులు పనులు యథాతథమయ్యాయి. మళ్లీ భూకబ్జాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట గంజాయి లభిస్తూనే ఉంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా చోరీల మీద చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
● తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ అధికారులు కేసుల తీవ్రతను బట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తారు.
● సంచలనం కలిగించే హత్య కేసులు ఒక్కటి, మూడు నెలల్లో రెండు కేసులు, 20 కిలోల గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లోని నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు.
● ఈ కేసులో సంవత్సరం వరకు బెయిల్ మంజురు కాదు.
● నిందితులను జైల్లోనే ఉంచి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, వారివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దు అనే ఆలోచనలతో పీడీయాక్టు నమోదు చేస్తారు.
● పోలీస్ కమిషనరేట్‌లో ఇప్పటివరకు మొత్తం 254 మందిపై పీడీయాక్టు పెట్టారు.
కోర్టు ఇబ్బందులతో వెనుకడుగు..
వివిధ రకాల నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో పోలీసు అధికారులకు కోర్టుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద నేరాలు ఒక్కటి చేసినప్పటికి వారిపై పీడీయాక్టు నమోదు చేసే నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నిందితులకు పీడీయాక్టు నివేదికలను వారి సొంత భాషలో ఇవ్వడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల పీడీయాక్టు కేసులు నమోదైనప్పటికీ అన్ని కేసులు చివరి వరకు నిలవడం లేదు.
హద్దుమీరితే పీడీ యాక్టు నమోదు
హద్దుమీరి నేరాలకు పాల్పడే వారిపై కచ్చితంగా పీడీ యాక్టు నమోదు చేస్తాం. ఈ కేసులతో నేరస్తుల్లో భయంతోపాటు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ట్ర దొంగల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. భూకబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం.
– సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment