లేకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని హౌసింగ్ బోర్డు నోటీసులు
కాలనీవారీగా బకాయిలు (రూ.లలో)
హన్మకొండ:
పెండింగ్ బకాయిలను రాబట్టుకునేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కఠిన చర్యలకు పూనుకుంది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు హౌసింగ్ బోర్టు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. వాయిదాల మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా కొంతమంది నిర్లక్ష్యం చేశారు. బకాయిలు తడిసి మోపెడు కావడంతో హౌసింగ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు. అసలుకు వడ్డీలపై వడ్డీలు వేసి అధిక మొత్తం చెల్లించాలని నోటీసులు జారీ చేశారని లబోదిబోమంటున్నారు.
వరంగల్ డివిజన్ పరిధిలో
528 మందికి నోటీసులు..
తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని హనుమకొండ వడ్డేపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, వరంగల్ గొర్రెకుంట కాలనీ, జగిత్యాల, మంచిర్యాల నస్‌పూర్ కాలనీ, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ కాలనీ, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జనగామలోని హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తగూడెం చుంచుకాలనీకు చెందిన బకాయిలు మొత్తం రూ.44,69,99,904 పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 528 మందికి నోటీసులు జారీ చేశారు.
ఒక్కో కాలనీలో రూ.3లక్షల నుంచి
రూ.18 లక్షలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.22,49,76,301 బకాయిలు పేరుకుపోయినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలు చెల్లించేందుకు గడువు విధించారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక్కో కాలనీలో బకాయిదారులు రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు బకాయిలున్నారు. బకాయిలు సంస్థకు గుదిబండగా తయారయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి బకాయిలు వసూలు చేయాల్సిందేనని సీరియస్‌గా చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు హుటాహుటినా నోటీసులు జారీ చేశారు.
నోటీసులు జారీ చేశాం...
పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– అంకం రావు, హౌసింగ్ బోర్డు
వరంగల్ డివిజన్ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment